పెగాసస్ వ్యవహారంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై హక్కుల తీర్మానాన్ని పెట్టేందుకు పలువురు ప్రతిపక్ష నేతలు సిద్ధపడుతున్న తరుణంలో అనధికారికంగా ఎలాంటి గూడచర్యానికి పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనధికార నిఘాకు తావివ్వని రీతిలో దేశంలో కాల పరీక్షకు నిలిచిన యంత్రాంగం వుందని పేర్కొంది.
భారత్‌లో ఇప్పటికే అమల్లో వున్న ప్రొటోకాల్స్‌ను పరిశీలించినట్లైతే మన చట్టాల్లో, సంస్థల్లో వున్న జాగ్రత్తలు, పకడ్బందీ ఏర్పాట్లతో ఏ రూపంలోనూ అక్రమంగా నిఘా పెట్టడమనేది సాధ్యం కాదని తెలిపింది.
గత జులైలో మొదటిసారిగా ఈ విషయమై వివాదం తలెత్తినపుడు వైష్ణవ్ పార్లమెంట్లో మాట్లాడుతూ, లాజిక్‌తో ఈ విషయాన్ని పరిశీలించినట్లైతే ఈ సంచలనం వెనుక ఎలాంటి సరుకు లేదని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఇజ్రాయిలీ సంస్థ ఎన్ఎస్ఒ నుండి తీసుకున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, రాజకీయ నేతలు, హక్కుల కార్యకర్తలు అందరిపై గూఢచర్యానికి పాల్పడ్డారని వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో మంత్రి పై రీతిన స్పందించారు.
ఈ నిఘా కోసం ఎవరి సాంకేతికతనైతే ఉపయోగించారో ఆ కంపెనీ కూడా ఈ వాదనలను ఖండిస్తోందని లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ మంత్రి వైష్ణవ్ తెలిపారు. అయితే, భారత్ ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అనేది మాత్రం ప్రస్తావించలేదు.
మరోవంక, ఎన్ఎస్ఓ గ్రూపు టెక్నాలజీస్‌తో తామెలాంటి లావాదేవీ జరపలేదని రక్షణ మంత్రిత్వ శాఖ గతేడాది ఆగస్టులో పార్లమెంట్‌కు తెలియజేసింది. తమ శాఖకు సంబంధించే ఈ వివరణ ఇచ్చింది కానీ, ఇతర మంత్రిత్వ శాఖలు లేదా సంస్థలు ఇజ్రాయిల్ సంస్థలతో లావాదేవీలు జరిపాయా లేదా అనేది పేర్కొనలేదు.
గతేడాది ఆగస్టులో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కూడా సుప్రీం కోర్టులో ఇదే విషయమై ఆరు పేజీల అఫిడవిడ్ను అందజేసింది. గతేడాది డిసెంబరులోనూ ఆ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఒ గ్రూపు అనే సంస్థను నిషేధించేందుకు ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.