ప్రభుత్వ నిర్బంధాలను, కక్షసాధింపు చర్యలను ఖాతరు చేయకుండా విజయవాడలో బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి నాయకత్వం మంత్రులతో జరిపిన చర్చలలో రాజీ పడి, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్యోగ సంఘాలు గెలుపొందగా, ఉద్యోగులు ఓటమి చెందారని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రతి ఉద్యోగి గెలుపు సాధించేవరకు పోరాటం చేస్తామన్న నేతలు మధ్యలో కాడి ఎత్తేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం మూడు షరతులకు అంగీకరిస్తేనే చర్చలు అని చెప్పిన నాయకులను ప్రభుత్వంలోని పెద్దలు వివిధ మార్గాల ద్వారా, తెరవెనుక వత్తిడులు తెచ్హి, ఎటువంటి అదనపు హామీలు ఇవ్వకుండానే చర్చలకు కూర్చోనేటట్లు చేసి, అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి, సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
పిఆర్సి ఒప్పందంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులో ఆదివారం ఈ విషయంపైనే చర్చ సాగింది. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆందోళన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల ఉద్యోగులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫిట్‌మెంట్‌పై చర్చకు అసలు అవకాశమే ఇవ్వకపోవడం, సిపిఎస్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను విస్మరించడం తదితర అంశాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెచ్ఆర్ఎ పై కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులు అసంతృప్తినివ్యక్తం చేస్తున్నారు.
బేషరతుగా చర్చల్లో ఆంతర్యం?
ప్రభుత్వం మూడు షరతులకు అంగీకరిస్తేనే చర్చలు అని చెప్పి.. బేషరతుగా మంత్రులతో చర్చలకు వెళ్లటంలోని ఆంతర్యమేమిటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అసోసియేన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు ప్రశ్నించారు.
విజయవాడలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ సాధన సమితి నిర్దేశించిన 3 షరతులకు ప్రభుత్వం ఒప్పుకోకుండానే.. చర్చలకు వెళ్లటంవల్ల సాధారణ ఉద్యోగుల్లో అనుమానాలు మొదలయ్యాయని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లటానికి జేఏసీ నేతలకు లభించిన హామీ ఏమిటని ప్రశ్నించారు.
ఉద్యోగులకు సంబంధిం చి రెగ్యులైజేషన్స్, పేస్కేల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రాట్యుటీ, హెల్త్‌కార్డులు, సమాన వేతనం, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్, వైద్య ఆరోగ్య శాఖ జీవో 27, గురుకులాలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్స్ వంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండగా ఏ హామీతో ప్రభుత్వంతో చర్చలకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
పిఆర్సి సాధన కమిటీ-ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం వల్ల 3.5 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్కర్ల జెఎసి విమర్శించింది.
ఈ ఒప్పందానికి నిరసనగా, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలని, 9న ముఖ్యమంత్రికి సామూహిక ఇ-మెయిల్ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
భగ్గుమంటున్న టీచర్లు
సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్లపై స్పష్టత రాకపోవడంపై టీచర్లు భగ్గుమంటున్నారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల తీరుపై విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. మమ్మల్ని నమ్మి మోసపోయిన వారికి ఏం సమాధానం చెబుతారంటూ ఉద్యోగ సంఘం నేతలను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజీపడ్డారని భావించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
పిఆర్సీలో నాయకులను మెప్పించి ఉద్యోగులను ముంచేశారని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జి ధ్వజమెత్తారు. గ్రాడ్యుటి ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఆర్సీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వానమైన పిఆర్సీ చూడలేదని పేర్కొంటూ, సమ్మెను విరమింపజేయడానికే మంత్రులు, అధికారుల కమిటీ చర్చలు జరిపి న్యాయమైన కోర్కెలు తీర్చకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తెరవెనుక ఉండి మంత్రులు, అధికారుల కమిటీతో నాటకం ఆడించారని ఆరోపించారు.
కాగా, ఎపి ఎన్జీవో జేఏసీ నుంచి ఎపిటిఎఫ్ (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) బయటకు వచ్చింది. జేఏసీలోని పదవులకు ఎపిటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజీనామా చేశారు. తమ డిమాండ్ల పరిష్కారంలో జేఏసీ విఫలమైందని ఎపిటిఎఫ్ నేతలు పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పరిష్కరించలేక పోయారని మండిపడ్డారు. ఛలో విజయవాడకు వచ్చిన ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించారని, పీఆర్సీలో టీచర్లకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని ఎపి టీచర్స్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు.
చరిత్రలో ఎరుగని జీతాల కోత
ఇంతవరకు ఉద్యోగుల చరిత్రలో 27 శాతం మధ్యంతర భృతిని ప్రకటించి, ఫిట్మేంట్ అంతకన్నా తక్కువ 23 శాతమే ఇవ్వడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అయినా ఇప్పుడు ఉద్యోగ నాయకులు తలవంచడం గమనార్హం.
2019 జూలై 1 నుండి 2020 మార్చి 31 వరకు చెల్లించిన 27 శాతం ఐ.ఆర్. మొత్తం రికవరీ ఉండదని చెప్పిన ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1 నుండి 2021 డిసెంబరు 31 మధ్య అదనంగా (ఐ.ఆర్. 27%కు, పిట్మెంట్ 23% కు మధ్య ఉన్న 4%) చెల్లించిన మొత్తాన్ని చేయబోతున్నట్లు స్పష్టం చేసినా నాయకులు అంగీకరించడం విస్మయం కలిగిస్తుంది.
“డిఏ బకాయిలను రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తాం” అని ప్రభుత్వం చెప్పడం, అందుకు ఉద్యోగ నాయకులు తల ఊపడం విచిత్రంగా కనిపిస్తుంది. ఇది హాస్యాస్పదం కూడా.
రెండు, మూడు విడతల్లో ఎడాదో, యేడాదిన్నరలోనో కాకుండా ఏకంగా రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తామనడం అసంబద్ధంగా వెల్లడవుతుంది. డిఏ బకాయిలను ఐ.ఆర్. రికవరీతో న్నినటి వరకు ముడిపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తామని పేర్కొనడం జరిగింది.
గ్రాట్యుటీని 2022 జనవరి నుండి అమలు చేస్తే 2018-2021 డిసెంబరు మధ్య రిటైర్ అయిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. జీఓల జారీ తర్వాత పీఆర్సీ నివేదిక ఇప్పుడు ఇవ్వడం వల్ల ప్రయోజనం కనిపించదు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసుని 2022 జూన్ 30 నాటికి క్రమబద్ధీకరించి, స్కేల్స్ అమలు చేస్తామనడం సముచితం కాదు. రెండేళ్ళకు క్రమబద్ధీకరిస్తామన్నారు. అంటే 2020 అక్టోబర్ నాటికి. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఆనాటికి ఉత్తీర్ణులైన వారిని 2022 జూన్ 30 నాటికి క్రమబద్దీకరించే ప్రక్రియ పూర్తి చేసినా, 2021 అక్టోబర్ నుండే స్కేల్స్ చెల్లించడం అన్యాయంగా భావిస్తున్నారు.
ఆర్.టి.సి. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి విడిగా జీఓ జారీ చేస్తామని తెలిపారు. ఆర్.టి.సి. ని ప్రభుత్వంలో విలీనం చేసి, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నప్పుడు వివక్షత ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. విశ్రాంత ఉద్యోగుల్లో 70-74, 75-79 వయస్సు వారికి చెల్లిస్తున్న అదనపు క్వాంటం పెన్షన్ లో కోతపెట్టాల్సినంత విధిలేని దుస్థితిలో రాష్త్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.