కర్ణాటకలోని విద్యా సంస్థలు, ఎక్కువగా కళాశాలలకు ముస్లిం బాలికలు హిజాబ్ తో హాజరు కావడంపై ఆంక్షలు విధించడంతో దుమారం రేగుతున్నది. విశ్వవిద్యాలయాలు, తమ ప్రాంగణంలో కొత్త డ్రెస్ కోడ్ నియమాన్ని అమలు చేశాయి, ఇది రాష్ట్రంలో భారీ రాజకీయ రగడకు దారితీస్తుంది.
గత కొన్ని వారాలుగా, యూనిఫాం కోడ్‌ను ఉల్లంఘించినందున, హిజాబ్ ధరించిన చాలా మంది విద్యార్థులను తమ దుస్తుల కోసం వారి కళాశాలల గేట్ల వద్ద ఆపివేస్తున్నారు. కర్ణాటకలోని ఉడిపి, చిక్కమగళూరు జిల్లాల నుంచి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
హిజాబ్ ధరించిన విద్యార్థులకు వ్యతిరేకంగా అనేక మంది కళాశాలల హిందూ బాల, బాలికలు కాషాయ కండువాలు ధరించి, “జై శ్రీ రామ్” నినాదాలు చేస్తూ తరగతి గదుల లోపల నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇది జరిగింది.
కర్ణాటక కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అమలు చేస్తున్న యూనిఫాం డ్రెస్ కోడ్ క్రమశిక్షణను అమలు చేస్తుందా లేదా ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధం సమకూరుస్తుందా అనే చర్చకు దారితీస్తున్నది.
విద్యా శాఖ కొత్త నిబంధనలు
కర్నాటకలో హిజాబ్ వివాదం తారాస్థాయికి చేరడంతో విద్యా సంస్థలలో చట్టానికి భంగం కలిగించే విధంగా ఆవరణలో ఎలాంటి దుస్తులు ధరించరాదని రాష్ట్ర విద్యా శాఖ సంస్థలకు కొత్త నిబంధనను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ఇలా ఉంది, “కర్ణాటక విద్యా చట్టం-1983లోని 133 (2) ప్రకారం, ఏకరీతి దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం తమకు నచ్చిన యూనిఫారాన్ని ఎంచుకోవచ్చు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వం నెలకొల్పుతామని పేర్కొంటూ విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధ నిర్ణయాన్ని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుండగా, ఇది విద్యార్థుల మత స్వేచ్ఛను కాలరాయడమేనని, హక్కును హరించడమేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
కాలేజీల్లో విద్యార్థినులు తమ తలాకప్పుకొంటూ వస్త్రం ధరించరాదని కొత్త యూనిఫాం కోడ్ నిబంధన వివక్షతో కూడుకున్నదని,ముస్లిం బాలికలు ఉన్నత విద్యను అభ్యసించకుండా అడ్డుకుంటామని కర్ణాటకలోని ప్రతిపక్ష నేతలు బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘విద్యార్థుల చదువును దూరం చేసే పథకం ఇది. ఆడ పిల్లలను చదువుకు దూరం చేయడమే లక్ష్యం’ అంటూ ఆరోపించారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “విద్యార్థుల హిజాబ్‌ను వారి చదువుకు అడ్డంకిగా ఉంచడం ద్వారా, మేము భారతదేశపు కుమార్తెల భవిష్యత్తును దోచుకుంటున్నాము. మా సరస్వతి అందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది, ఆమె భేదం చూపదు’ అంటూ బిజెపి ప్రభుత్వంపై దండెత్తారు.
“బిడ్డలు విభేదాలను మరచి భారతీయులుగా ఏకం చేయడంలో సహాయపడటమే” యూనిఫాం డ్రెస్ కోడ్ వెనుక ఉద్దేశ్యం అని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు.
మహిళలను మసీదుల్లోకి పంపగలరా?
దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిది కొత్తగా కళాశాలలో హిజాబ్‌తో తరగతులకు బాలికలు రావడం ప్రాథమిక హక్కుగా మాట్లాడే సిద్దరామయ్య మహిళను మశీదులలోకి పంపగలరా? అంటూ కన్నడ సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునిల్‌కుమార్ ప్రశ్నించారు.
హిజాబ్ పేరుతో కొందరు విద్యార్థినులను ముందుకు పంపి అరాచకం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పాఠశాల ప్రాంగణం దాకా హిజాబ్‌తో పాటు బురఖాతోను రావచ్చునని కానీ తరగతి గదికి కాదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలోను యూనిఫాం విధానం ఉందని పేర్కొంటూ విద్యార్థులందరూ ఒకే విధమైన యూనీఫాం ధరించిడం అందరూ సమానమనే సందేశానికనేది గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
త్రిపుల్ తలాక్ ద్వారా మైనార్టీ మహిళలకు భద్రత కల్పించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని ఆయన గుర్తు చేశారు. ఎస్డీపీఐ, యూటీ ఖాదర్ మాటలు విని విమర్శలు చేయరాదని సూచించారు.
కాగా మైసూరు ఎంపీ ప్రతాపసింహ మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ను సిద్దరామయ్య సమర్థించడం చూస్తుంటే రానున్న ఎన్నికల నాటికి సిద్ద రహీమ్య్యగా పేరు మార్చుకొంటారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసమే సిద్దరామయ్య హిజాబ్‌ను సమర్థించారని హితవు చెప్పారు.
ఆరుగురు విద్యార్థులు హిజాబ్ పేరుతో 600 మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టడం గురించి ఎందుకు సిద్దరామయ్య స్పందించరని నిలదీశారు. ఈ విధంగా, రెండు వైపుల నుండి పరస్పరం విమర్శలు చేస్తూకొంటున్న ప్రకటనలు తీవ్రం అవుతున్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం కళాశాల ప్రాంగణంలో ఎలాంటి తలపాగాలను నిషేధించాలనే తన నిర్ణయంపై దృఢంగా ఉంది.