అమెరికా -కెనడా సరిహద్దులు దాటుతున్న సమయంలో కరోనా టీకాలు తప్పనిసరి చేసిన నిబంధనలతో పాటు జస్టిస్ ట్రూడో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ట్రక్కర్లు చేపడుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయని, అవి నియంత్రణలో లేవని ఒట్టావా మేయర్ తెలిపారు. దీంతో అక్కడ అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.
ఈ నిబంధనలకు వ్యతిరేకంగా గత నెల 29న రాజధానికి చేరుకున్న నిరసనకారులు, నగర వీధుల్లో వారి భారీ వాహనాలను నిలిపివేసి, గుడారాలు, తాత్కాలిక గుడిసెలు వేశారు. ఈ చర్య అధికారులను దిగ్భ్రాంతికి గురి చేయగా, అక్కడ నివాసితులు కూడా ఈ నిరసనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరసనల వల్ల నివాసితుల భద్రతతో పాటు వారి రక్షణకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు మేయర్ జేమ్ వాట్సన్ తెలిపారు. అంతేకాకుండా దీని వల్ల ఇతర అధికార పరిధి, ప్రభుత్వాల మద్దతు అవసరం కూడగట్టుకోవాల్సిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు అధికారుల కన్నా నిరసనకారులు అధికంగా ఉన్నారని తెలిపారు. తాము వారితో జరుపుతున్న పోరాటంలో ఓడిపోతున్నామని తెలిపారు. ఆందోళనలను హింస్మాతకంగా చేపడుతున్నారంటూ ఆరోపించారు. వారి వాహనాల హారన్లను మోగించడం, బాణా సంచా పేల్చడం వంటి చర్యలకు దిగుతున్నారని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని చెప్పారు.
కాగా, కరోనా సంబంధిత ఆంక్షలు ఎత్తివేసే వరకు ఈ నిరసనలు కొనసాగుతాయని ట్రక్కర్లు చెబుతున్నారు. అయితే వీరికి మద్దతు తెలిపే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు.