తెలంగాణ బిజెపి నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్ల హుందాగానే వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర మంత్రులు సహితం కలవడం, రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సానుభూతితో స్పందించడం చేస్తున్నారు.
వాస్తవానికి వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాల క్రింద వస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్ధికంగా నిలదొక్కుకో గలుగుతున్నది. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రవిష్కరణకు వచ్చే ముందు మీడియా సమావేశంలో కేవలం కేంద్ర బడ్జెట్ పైననే కాకుండా, ప్రధాని, ఆర్దిక మంత్రులపై వ్యక్తిగత దాడులకు దిగడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవంక, ప్రధానికి కనీసం స్వాగతం పలుకక పోవడమే కాకుండా, ఆయన కార్యక్రమాలలో ఎక్కడా కేసీఆర్ పాల్గొనక పోవడంతో ప్రతికూల సంకేతాలు పంపించినట్లు అయింది. దానితో రాబోయే రోజులలో కేసీఆర్ వ్యవహారశైలి పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించే అవకాశాలున్నట్లు రాష్ట్ర బిజెపి నాయకులు ఇస్తున్నారు.
అటువంటి పరిస్థితిని నివారించడంకోసం కేసీఆర్ కు సన్నిహితులుగా భావిస్తున్న త్రిదండి చినజీయర్‌స్వామి స్వయంగా రంగంలోకి దిగారా? మంగళవారం సమతామూర్తి సందర్శనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఆయన ప్రస్తావించిన అంశాలను అందుకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నాయి.
ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. రాజకీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ భగవంతుని కార్యక్రమాలు, సేవ విషయంలో కలిసి పనిచేయాలని హితవు పలికారు. భక్తిమార్గంలో ఉన్న వారందరూ కలిసిమెలసి ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
సమతామూర్తి దివ్యక్షేత్రం పనులకు ఆరంభం నుంచి సీఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా శ్రీవైష్ణవుడేనని, ఆయనకు భక్తికూడా ఎక్కువేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళుతున్నారని కొనియాడారు.‘
‘మేము భారతీయులమని మనమంతా దేశంలో, బయటా గర్వంగా చెప్పుకునే విధంగా పాలిస్తున్నారు’’ అని కొనియాడారు. కాగా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత అంతటి సమర్థ నేత అమిత్‌షా అని మైహోం రామేశ్వరరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ విషయమై అమిత్ షా మాత్రం ఎటువంటి స్పందనను వ్యక్తం చేయక పోవడం గమనార్హం.
సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్లే సమయం
‘‘సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన కాలం. సమతామూర్తి నిర్మాణం జరిగిన సమయంలోనే భవ్యమైన రామమందిర పునర్నిర్మాణం, 650 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ్కారిడార్, కేదార్ధామ్, బదరీధామ్ పునర్నిర్మాణం లాంటివి జరగడం విధి, విధాత ఇచ్చిన ఆశీర్వాదం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా పేర్కొరు.
ముచ్చింతల్ దివ్యక్షేత్రానికి విచ్చేసిన ఆయన.. సంప్రదాయ దుస్తుల్లో, తిరునామాలు ధరించి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం ఆశ్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను జన్మతః వైష్ణవుడినని.. తన తల్లి వల్లభాచార్య సిద్ధాంతాలపైనే జీవితాన్ని గడిపారని అమిత్ షా తెలిపారు. తాను పుట్టి పెరిగిన గ్రామం అహ్మదాబాద్‌కు 50 కి.మీ. దూరంలో ఉందని, అక్కడ 150 ఏళ్లనాటి గ్రంథాలయంలో రామానుజాచార్యులు రచించిన తొమ్మిది గ్రంథాలు చదివానని వివరించారు.
రామానుజాచార్యుల జీవితమే ఓ సందేశమని.. అందరూ సమానులే అని వెయ్యేళ్ల క్రితమే ఆయన చాటారని.. ఆలయ ప్రవేశంలో అందరికీ సమాన హక్కు ఉందని చెప్పడమే కాకుండా సంపూర్ణంగా అమలుచేసిన మహనీయుడు రామానుజాచార్యులని ప్రశంసించారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతమార్గంతో సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారని.. ఈ మార్గంతోనే దేశం తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ ఏకతాటిపై నిలబడిందని కొనియాడారు.
సమతామూర్తి యుగయుగాల వరకూ రామానుజాచార్యుల సందేశాన్ని తెలుపుతుందని, విశిష్టాద్వైతం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. సనాతన ధర్మంలో సమస్యలు వచ్చినప్పుడల్లా.. శంకరాచార్యులు, రామానుజాచార్యులు.. ఇలా ధర్మ రక్షణ కోసం ఎవరో ఒకరు ముందుకొచ్చారని గుర్తుచేశారు.
ధర్మం కోసం జీవితాన్ని అర్పించిన మహాపురుషుల విగ్రహాలను చూస్తే.. ఎంతో ఉత్సాహం లభిస్తుందని, మనల్ని మరింత ముందుకు వెళ్లే శక్తిని అవి అందిస్తాయని షా అన్నారు. తాను కూడా ఈరోజు అలాంటి శక్తిని, ఉత్సాహాన్ని పొందానని చెప్పారు.