శ్రీరామనగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ పూర్వ సహా కార్యవహ్ భయ్యాజీ జోషి దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు.
ఆలయాల విశేషాలను వారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వివరించారు. అనంతరం సమతామూర్తి ప్రాంగణం ముందు భగద్రామునుజుల జీవిత చరిత్ర త్రీ డీ షోను వారు వీక్షించారు. సాయంత్రం యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞంలో పాల్గొన్నారు మోహన్ భగవత్, శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు పాల్గొన్నారు. ప్రధాన యాగమండపంలో కంకణం ధరించి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వారిని సత్కరించి, వారికి మంగళాశాసనాలు అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్యర్యంలో ధర్మాచార్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని పలుప్రాంతాల నుంచి వచ్చిన 385 మంది సాధుసంతులు, పీఠాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.
హిందూ పురాణాలు సమానత్వాన్ని నేర్పాయని ఈ సదస్సులో మోహన్ భగవత్ గుర్తు చేశారు. వేల ఏళ్ల నుంచే హిందూ సంస్కృతిలో సమానత్వం ఉందని పేర్కొంటూ, అందరినీ సమానంగా చూడటమేకాదు ఆత్మబంధువుల్లా చూడటమే హిందూ సంప్రదాయమని చెప్పారు.
వెయ్యేళ్ల నుంచి ఎన్నో దండయాత్రలను ఎదుర్కొన్న చరిత్ర హిందూమతానిదని చెబుతూ సనాతన ధర్మం ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని తెలిపారు. మనం వసుధైక కుటుంబం అని అనుకుంటున్నాం కానీ అంతటా అలా లేదని భగవత్ గుర్తు చేశారు.
హిందూ మతాన్ని దెబ్బతీయాలనుకున్నవాళ్లే దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. హిందూ సమాజం ఇతరులతో శతృత్వం పెట్టుకోదని స్పష్టం చేశారు. భాష, ప్రాంతం, సంప్రదాయాలు వేరైనా భారతీయులంతా ఒకటేనని తెలిపారు. హిందువుల ఐక్యతే హిందుత్వానికి బలమని చెప్పారు.
హిందువుల నినాదం సమాజ హితం కావాలని చెబుతూ రామానుజాచార్యుల విశాల విగ్రహం సమతా స్ఫూర్తిని చాటిచెబుతుందని ఆయన పేర్కొన్నారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని సరైన సమయంలో స్థాపించి భాగ్యనగరం పేరును సార్థకత వచ్చిందని భగవత్ కొనియాడారు.
ఇక భగవద్రామానుజుల 216 అడుగుల ప్రతిమ సమానత్వానికి ప్రతీక అని శివరాజ్‌సింగ్ చౌహన్ చెప్పారు. సమతామూర్తి కేంద్రం అందరికీ ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. అందరూ లక్ష్మీనారాయణ సంతానమేనన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కులాల పేరుతో హిందూ సమాజం చీలిపోవద్దని హితవు చెప్పారు.
కుల విభేదాలు సమసిపోవాలని స్పష్టం చేస్తూ రామానుజాచార్యులు మనుషులంతా ఒక్కటేనని చెప్పారని ఆయన గుర్తు చేశారు. చౌహాన్. అందరికీ ముక్తి లభిస్తుందంటే తాను నరకానికి వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించిన మహోన్నతమూర్తి రామానుజాచార్యులని అని ఆయన గుర్తు చేసుకున్నారు.
భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీపై ప్రశంసలు కురిపిస్తూ లోకకల్యాణానికి చిన్నజీయర్ స్వామీజీ శ్రీకారం చుట్టారని కొనియాడారు. మానవుల్లో ఉన్న అసమానతలు అనే వైరస్‌ను తొలగించి సమతను పెంపొందించేందుకే సమతా మూర్తి విగ్రహాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఏర్పాటు చేశారని తెలిపారు.
అందుకే శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కూడా చేస్తున్నామని తెలిపారు. తమ ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించేవారే నిజమైన వైదికులు చిన్నజీయర్ స్వామీజీ అని ప్రశంసించారు. .