ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ (మేక్రోఎకానమీ)కు ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ, రెండిందాల సవాళ్ళను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు.
మూడు రోజుల పాటు సాగిన ఆర్బిఐ ద్వై మాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వివరిస్తూ వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ స్వంత రిస్క్‌తోనే ఆ పని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించడం తన కర్తవ్యమని తెలిపారు. క్రిప్టోకరెన్సీకి ఎటువంటి ఆధారాలు లేవని పెట్టుబడిదారులు గమనించాలని చెప్పారు.
అది కనీసం టులిప్ అయినా కాదని స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలో టులిప్ మానియా నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫైనాన్షియల్ బబుల్‌కు ఉదాహరణగా దీనిని చెప్తూ ఉంటారు. వాస్తవ విలువ కారణంగా కాకుండా స్పెక్యులేటర్ల కారణంగా టులిప్ విలువ పెరుతూ ఉండేది.
ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించారు. వరుసగా 10వ సారి భేటీలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీల గురించి మాట్లాడుతూ ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు లేదా మీరు ఏ పేరు పెట్టి పిలిచినా సరే, అవి మన స్థూల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, ఆర్థిక సుస్థిరతకు పెను ముప్పు కలిగిస్తాయి. ఆర్థిక సుస్థిరత, మేక్రోఎకనమిక్ సుస్థిరత సమస్యలను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యానికి విఘాతం కలిగిస్తాయి’’ అని ఆయన హెచ్చరించారు.
ఎమర్జెన్సీ హెల్త్ సర్వీస్, కాంటాక్టింగ్ ఇంటెన్సివ్ సర్వీస్‌ల కోసం గత జూన్‌లో మొత్తం రూ.65 వేల కోట్ల రుణాలు కేటాయించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించామని దాస్ తెలిపారు. కరోనా భయాలు పూర్తిగా తొలగనందున ఈ పథకాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నామన్నారు. నిధుల లభ్యత పెరగడం వల్ల వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగవుతాయని దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సమర్పిస్తూ క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. 2023 నుంచి దేశంలో తొలి డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రారంభిస్తుందని చెప్పారు.