216 అడుగుల విగ్రహం రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నాట్లు చెబుతూ రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుతో యుగయుగాలకు రామానుజాచార్యుల సందేశం అందుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకొని, యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్రమాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌కు పూజలు చేశారు. రాజ్‌నాథ్ సింగ్‌కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ మంగళాశాసనాలు అందించారు.
ప్రవచన మండపంలో రాజ్ నాథ్ సింగ్ భగవద్రామానుజాచార్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామానుజాచార్యుల సమతా సిద్ధాంతాన్ని వివరించారు. రామానుజాచార్యుల విశాల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులను అభినందించారు.
రామానుజాచార్యుల శిష్యుల్లో అన్నికులాలకు చెందినవారున్నారని చెబుతూ తనకు గురువు చెప్పిన ముక్తిమంత్రాన్ని గుప్తంగా పెట్టకుండా అందరి ముందూ ఆలపించారని గుర్తు చేశారు. తాను నరకానికి వెళ్లినా ఫర్వాలేదని.. వేలాది మందికి ముక్తి లభిస్తే చాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని రాజ్‌నాథ్ తెలిపారు.
లోకకళ్యాణం కోసం హిందువుల ఐక్యత కోసం రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని చెబుతూ భగవద్రామానుజులు వైష్ణవ సంప్రదాయాలను అన్నివర్గాల ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. కులాల గోడలు బద్దలు కొట్టి అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. భక్తిలో సమానత్వాన్ని చాటిచెప్పారని తెలిపారు. ప్రపంచమంతా రామానుజాచార్యుల ఉపదేశాన్ని వ్యాప్తి చేయాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.
ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు భారత సనాతన ధర్మాన్ని కాపాడేందుకు విశేష కృషి చేశారన్నారని పండిట్ రవిశంకర్ తెలిపారు. భారత విద్యార్థులకు ఆధునిక విద్యతోపాటు ఆధ్యాత్మికతను జోడించి బోధించాల్సిన అవసరముందుని ఆయన ఈ సందర్భంగా సూచించారు. 108 దివ్యదేశాలను ఒకేచోట ప్రతిష్టించడం గొప్ప విషయమని కొనియాడారు.
వెయ్యేళ్ల క్రితమే సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని రవిశంకర్ చెప్పారు. వెయ్యేళ్ల క్రితమే అన్నిజాతుల ప్రజలను ఆలయ ప్రవేశం చేయించిన సమతామూర్తి సంకల్పం మహోన్నతమైనదని పేర్కొన్నారు. రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ రామేశ్వరరావులను ఆయన అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం శభపరిణామమని త్రిదండి చిన్నజీయర్స్వామీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాశీలో మహదేవుడి ఆలయ పునరుద్ధరించడం, అయోధ్యలో రామ మందిరం పునర్ నిర్మిస్తుండటం ద్వారా హిందూ ధర్మం పట్ల తమకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారని పేర్కొన్నారు.
దేశం గర్వపడేలా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. రాజ్‌నాథ్ మార్గనిర్దేశంలో భారత ఆర్మీ మరింత శక్తివంతంగా తయారైందని కొనియాడారు.