టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబును లోకాయుక్త ఆదేశంపై కేసు నమోదు చేసి, సిఐడి అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వీస్ రికార్డు విషయంలో సీఐడీతో దర్యాప్తు చేయించాలని లోకాయుక్త ఆదేశించడంపై మండిపడింది. అరెస్ట్ కు కారణమైన లోకాయుక్తను తన కేసులో ప్రతివాదిగా చేర్చమని అశోక్‌బాబును ఆదేశించింది.
ఈ విషయంలో లోకాయుక్త విచారణాధికార పరిధి ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంటూ ఈ ఆదేశాలివ్వడానికి దానికి ఉన్న అధికారాలు ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలను జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి ప్రాథమిక విచారణా లేకుండా లోకాయుక్త ఆదేశాల మేరకు పిటిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది.
సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హతలు ఎవరు, ఎప్పుడు ట్యాంపర్ చేశారో కనీస సమాచారం లేకుండా కేసు నమోదు చేసిన సీఐడీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు నమోదు చేసే మందు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేవో పరిశీలించరా? అధికారుల విచక్షణాధికారం మేరకు కేసులు నమోదు చేస్తారా? అని మండిపడింది.
పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య అభ్యర్ధించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. లోకాయుక్తను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది అధికారాలపై లోకాయుక్త వాదనలు వినాల్సి ఉందని అభిప్రాయపడింది.
కేసు నమోదుకు ఉన్న ఆధారాలేమిటి? నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు ఎలా వర్తిస్తాయి? బెయిల్ ఎందుకు మంజూరు చేయకూడదో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణను సోమవారాని(14వ తేదీ)కి వాయిదా వేసింది.
సీఐడీ కౌంటర్ పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డి.రమేశ్ శుక్రవారం ఆదేశాలిచ్చారు.
సర్వీసు రికార్డులో విద్యార్హతను ట్యాంపర్ చేశారనే ఆరోపణలతో సీఐడీ ఇటీవల అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి.. గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన శుక్రవారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం ధాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం లంచ్ మోషన్‌గా తీసుకుని విచారణ జరిపింది.
అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సర్వీసుకు సంబంధించిన వ్యవహారంలో పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గానీ, సీఐడీ విచారణ జరపాలని గానీ ఆదేశించే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీ చేసేముందు పిటిషనర్‌కు నోటీసు ఇవ్వలేదని పేర్కొన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవని తెలిపారు.
1996లో విద్యార్హత విషయంలో సర్వీసు రికార్డు ట్యాంపర్ చేశారని సీఐడీ ఆరోపణ చేసిందని.. అయితే శాఖాపరమైన విచారణలో పిటిషనర్ తప్పు లేదని నిర్థారించినట్లు వెల్లడించారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎలాంటి ప్రాథమిక విచారణా లేకుండా 26 ఏళ్ల తర్వాత సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఫిర్యాదు చేయడంలో జాప్యం జరిగితే.. ముందు కేసు నమోదు చేయకుండా ప్రాథమిక విచారణ జరపాలని లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
పిటిషనర్ నాలుగేళ్ల క్రితమే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ ఉద్యోగుల సమస్యల పై పోరాడుతున్నారని చెబుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా గొంతునొక్కేందుకే కేసు నమోదు చేశారని వివరించారు. పిటిషనర్‌కు గుండె శస్త్ర చికిత్స చేసి స్టంట్లు వేశారని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు.