పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆమె మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బనెర్జీల మధ్య తలెత్తిన విబేధాలు ఈ మధ్య తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఇరువురు భిన్నమైన ధోరణులు ఆవలంభించడమే అందుకు ప్రధాన కారణం.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రచారం, వ్యూహంలలో అభిషేక్ కీలక పాత్ర వహించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో పార్టీ ప్రచార వ్యూహాలను నిర్ణయించడంలో ఆయనే కీలక భూమిక వహించారు. అందుకనే ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన, ఆయన కుటుంభం సభ్యులు లక్ష్యంగా దాడులు జరిపాయి కూడా.
ముఖ్యంగా పార్టీలో `ఒక వ్యక్తి కి ఒకే పోస్ట్’ అనే విధానం స్పష్టంగా అమలు జరపాలని అభిషేక్ నాయకత్వంలోని యువ నేతలు తెస్తున్న వత్తిడులే వారిద్దరి మధ్య విబేధాలకు ప్రధానంగా కనిపిస్తున్నది. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-పాక్ బృందం సలహాలపైననే అభిషేక్ ఇటువంటి వత్తుడులు తెస్తున్నారని మమతా వారి పట్ల ఈ మధ్య ఆగ్రహంగా ఉంటున్నట్లు కూడా కధనాలు వచ్చాయి.
ఈ విషయమై మమతా శనివారం సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో ఒక సమావేశాన్ని ఏర్పర్చి, 20 మందితో జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు మమతా ప్రయత్నించారు. ఈ సమావేశంలో అఖిలేష్ కూడా పాలొన్నారు. మతా తర్వాత పార్టీలో అంతటి ప్రాధాన్యత కల్గిన అభిషేక్ మధ్య పెరుగుతున్న విబేధాలు పార్టీ వర్గాల్లో కలవరానికి గురిచేస్తున్నాయి.
కొందరు ఎమ్మెల్యేలు రెండు, మూడు పదవులను చేపడుతుండటాన్ని అభిషేక్ వర్గం వ్యతిరేకిస్తోంది. ఓ మంత్రి కూడా మంత్రి పదవితోపాటు, మేయర్ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. దీనిని అభిషేక్ వర్గం తప్పు పడుతోంది.
అభిషేక్ వర్గీయులు శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో తాము ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానానికి అనుకూలమని పేర్కొన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేల విషయంలో ఈ నిబంధనను మమత బెనర్జీ సడలించారు. ఆ ఎమ్మెల్యేల్లో కొందరు కోల్కతా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేశారు. ఫిర్హాద్ హకీమ్ మంత్రి పదవిని, కోల్కతా మేయర్ పదవిని నిర్వహిస్తున్నారు.
ఈ విధానానికి అనుకూలంగా పార్టీ సీనియర్ నేత, మంత్రి చంద్రిమ భట్టాచార్య శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ట్వీట్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం 4.05 గంటలకు దానిని తొలగించారు. తన సోషల్ మీడియా ఖాతాలను ఐ-ప్యాక్ దుర్వినియోగం చేసిందంటూ ఆమె పేర్కొనడంతో విబేధాలు బహిర్గతంగా భగ్గుమన్నాయి.
ఎన్నికల ముందు తన పేరున ఖాతాలను సృష్టించి ఐ ప్యాక్.. తనకు తెలియకుండానే వన్ మ్యాన్, వన్ పోస్టు పెట్టిందని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే, దీనిపై ఐ ప్యాక్ కూడా స్పందిస్తూ.. తమ సంస్థ.. ఏ నేతలకు చెందిన ట్విట్టర్ ఖాతాలను వినియోగించలేదని, ఎవరైనా ఆరోపణలు చేస్తే అందులో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది.
కాగా, ఉత్తరప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్కు మద్దతుగా ప్రచారానికి వెళ్లిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మేనల్లుడితో విబేధాలపై ప్రచారానికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి. గోవాలో ప్రచారానికి వెళ్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘అక్కడ ఎవరో చేస్తున్నారు.. నేను కాదు.. నేను ఎంతో ఆసక్తితో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాను’ అని ఆమె బుదులిచ్చారు. గోవాలో టిఎంసి బాధ్యతలను అభిషేక్ బెనర్జీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుండగా, రాష్ట్రంలోని 112 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో రెండు జాబితాలు బయటకు వచ్చాయి. ఒకదానిపై టీఎంసీ నేత పార్థ ఛటర్జీ, సుబ్రత బక్షి సంతకాలు చేశారు. మరొకదాన్ని టీఎంసీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సంతకాలు చేసినదే సరైన జాబితా అని మమత స్పష్టం చేశారు.