భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 5.59 నిమిషాలకు ప్రయోగించింది.
కాగా, ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన తొలి మిషన్ ఇదే. ప్రయోగానికి సంబంధించి 25 గంటల కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈవోఎస్-04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను..రోదసిలోకి పిఎస్ఎల్ వి -52 మోసుకెళ్లింది.
1,710 కిలోల ఆర్ఐ(ఈవోఎస్-04), 17.50 కిలోల ఐఎన్ఎస్-2టీడీ..8.10 కిలోల ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను రోదసిలోకి రాకెట్ తీసుకెళ్తుంది. వీటితో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది.
ఈవోఎస్-04 అనేది రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది వ్యవసాయం, అటవీ, తోటలు, నేత తేమ, హైడ్రాలజీ వంటి యాప్‌లకు నాణ్యమైన చిత్రాలను అందించనుంది. ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలు తీసుకున్నాక ఇది మొదటి ప్రయోగం. ఇస్రో విజయాశ్వం పీఎస్ఎల్వీ ద్వారా చేపట్టిన ప్రయోగాల్లో ఇది 54వది.