పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పుల్వామా ఉగ్రదాడి జరిగిన వార్షికదినం సందర్భంగా ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడ్డం ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఘాటుగా స్పందించారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోడీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కేనని, కానీ మన సాయుధ దళాలను అవమానించడం కేవలం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
“అభినందన్ వర్థమాన్ పరాక్రమం చాలదా? బాలాకోట్ ఘటన అనంతరం 6 నెలలకు పైగా తమ సొంత గగనతలంలో ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్థాన్ చర్యలు చాలవా? ఇవి సరిపోకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గరే రుజువు కోరవచ్చు.” అంటూ మరో ట్వీట్ చేశారు.
భారత సాయుధ బలగాలు సరిహద్దుల వెంబడి శత్రువులపై ధైర్యంగా పోరాడుతున్నాయని, గత సంవత్సరం తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు మనల్ని రక్షించడానికి తన ప్రాణాలను బలిచ్చాడని గుర్తుచేశారు. మన గొప్ప దేశాన్ని కాపాడుకోవడంలో వీరమరణం పొందిన వారిని అవమానించవద్దని తాను సీఎం కేసీఆర్‌ను కోరుతున్నానని కిషన్ రెడ్డి ట్వీట్లలో పేర్కొన్నారు.