ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వానికి నిరసనగా ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతోనే ఆయనను బదిలీ చేశారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా మంగళవారం మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారని, ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం తనకు విస్మయం కలిగించిందని పవన్ తెలిపారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందని పవన్ ఆరోపించారు. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.