తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ మేడారం జాతర నేడే ప్రారంభం అవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతరలో దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 16న ప్రారంభమై 19 వరకు నాలుగు రోజుల పాటు జరుగుతాయి.
తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకునేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు. కొద్దీ కాలం వరకు గ్రామీణులే ఎక్కువగా పాల్గొనే ఈ జాతరను 1998లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి, అధికారికంగా జరుపుతూ ఉండడంతో రవాణా, ఇతర సదుపాయాలు బాగా పెరిగాయి. దానితో పట్టణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.
13వ శతాబ్దంలో సమ్మక్క, సారలక్క అనే తల్లీ బిడ్డలు ప్రజల కోసం అప్పటి కాకతీయులతో పోరాడి అమరులయ్యారు. అయితే వారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భక్తులు నమ్ముతారు. అందుకే సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పెద్ద పండుగలా జాతరను జరుపుకుంటారు.
మేడారం చరిత్ర విషయానికి వస్తే.. 1000 క్రీ.శతాబ్దంలో మేడారం ప్రాంతంలో ఉన్న గిరిజనులు అడవిలో వేటకు వెళ్తారు. అక్కడ పులులతో ఆడుకునే ఒక చిన్న పాప వారికంట కనబడుతుంది. సాక్షాత్తు దైవాంశ సంభూతురాలిగా ఆ పాప తేజాన్ని ప్రకాశిస్తూ ఉండేది.
గిరిజనులు ఆ పాపను అడవి నుంచి తీసుకురావడంతో వారి గిరిజనుల రాజు ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసి సొంత బిడ్డలా పెంచుకుంటారు. వయసు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే అక్కడి గిరిజన రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఆ కాలంలో ఆంధ్రా వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించే వారు. ఈ పడిగిద్ద రాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు.
కాకతీయులతో యుద్ధం ఎందుకు చేస్తారు.
గిరిజనుల నాయకుడు పగిడిద్ద రాజును కాకతీయులు ఎక్కువ కప్పం కట్టాలని డిమాండ్ చేస్తారు. పగిడిద్ద దాన్ని వ్యతిరేకించడంతో పాటు పంటలు పండలేదని, కప్పం కట్టబోమని తెగేసి చెబుతాడు. కాకతీయుల వద్ద పనిచేస్తున్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడతాడు. అది సహించని కాకతీయులు వారితో యుద్ధానికి దిగుతారు. ఈ యుద్ధంలో గిరిజన నేతలు అంతా చనిపోతారు.
అయితే.. పగిడిద్ద రాజు, సమ్మక్కకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వీరందరూ కూడా కాకతీయులతో జరిగిన పోరాటంలో హతమవుతారు. కాగా, జంపన్నను అక్కడున్న వాగులో పడేయడంతో అప్పటి నుంచి మేడారం సమీపంలో ఉన్న వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. సమ్మక్క, సారలమ్మలకు వారి నడుం నుంచి కత్తులు దిగబడ్డా కూడా అలానే నడుచుకుంటే ఓ గుట్టలో అదృశ్యమవుతారు. అప్పటి నుంచి వారిని దేవతలుగా కొలిచి ఆరాధిస్తున్నారు భక్తులు.
మేడారం జాతర వేళ ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడే ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.