హువావే భారత్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. హువావే ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్టు సమాచారం. ఆదాయపన్ను ఎగవేతను గుర్తించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారి వెల్లడించారు.
ఇదేమాదిరి సోదాలు చైనాకు చెందిన జెడ్ టీఈ భారత కార్యాలయాల్లో కొన్ని నెలల క్రితం జరగడం గమనార్హం. సోదాల సందర్భంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
చైనాకు చెందిన ఒప్పో, షావోమీ కంపెనీల్లోనూ ఐటీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. విక్రయాలకు సంబంధించి విలువను తక్కువ చేసి చూపించారంటూ, ఎగవేసిన పన్నును చెల్లించాలంటూ షావోమీకి నోటీసులు జారీ చేయడం తెలిసిందే.
ఐటీ సోదాలపై హువావే స్పందించింది. భారత్ లో తమ కార్యకలాపాలు స్థానిక చట్టాలకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.
ఇలా ఉండగా, పన్నుఎగవేత విషయంలో హువావేపై ఆరోపణలను రావడంతో కేంద్ర ప్రభుత్వం 5G సేవల కోసం హువావేను ట్రయల్స్ నుంచి దూరంగా ఉంచింది. అయినప్పటికీ, టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి వారి పాత ఒప్పందాల ప్రకారం హువావే, ZTE నుంచి టెలికాం గేర్‌ను సోర్స్ చేయడానికి అనుమతించారు.
అయితే టెలికమ్యూనికేషన్ సెక్టార్‌పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ప్రకారం ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందంలోకి వచ్చే ముందు వారికి ప్రభుత్వం ఆమోదం అవసరం. కాగా గత ఏడాది షావోమీ, ఒప్పో చైనీస్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలను నిర్వహించింది. ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ. 6500 కోట్లను ఐటీ శాఖ జరిమానా వేసింది.