యుద్ధ మేఘాలు ఆవహించిన ఉక్రెయిన్ సరిహద్దుల్ల నుండి రష్యా సేనలు కొంతమేరకు వెనుతిరగడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకొంటున్న సమయంలో ఈ దేశంపై సైబర్ దాడి జరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లపై, ప్రధాన బ్యాంకులపై మంగళవారం సౖౖెబర్ దాడి జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. డిప్యూటీ మంత్రి విక్టర్ జోరా కూడా ఈ దాడిని ధృవీకరించారు.
డిడిఓఎస్ దాడుల కారణంగా కనీసం 10 ప్రభుత్వ వెబ్సైట్లు పనిచేయడం లేదు. వీటిలో రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక శాఖల వెబ్సైట్లతో పాటు రెండు అతిపెద్ద బ్యాంక్‌ల వెబ్సైట్లు కూడా వున్నాయి. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులైన ప్రివత్బ్యాంక్, స్బెర్బ్యాంక్ల్లో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపుల్లో, బ్యాంక్ యాప్‌ల్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
అయితే, డిపాజిటర్ల నిధులకు ఎలాంటి ముప్పు లేదని ఉక్రెయిన్ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి వెనుక రష్యా వుందేమోనన్న అనుమానాలను మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. అయితే అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. జనవరి మధ్యలో ఒకేసారి 70కి పైగా ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్సైట్లు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోయాయి. ఈ సైబర్ దాడి వెనుక రష్యా వుందంటూ ఆనాడు ఉక్రెయిన్ ఆరోపించింది.
రష్యా దాడిచేస్తే తిప్పికొట్టేందుకు సిద్ధం
ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేందుకు అవకాశం ఉన్నందున, అందుకు ప్రతిస్పందించేందుకు అమెరికా కూడా సిద్ధంగానే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాక యుద్ధం అంచుల నుంచి వెనక్కి తగ్గాలని కోరారు. ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై తాజా వివరణ ఇచ్చిన బైడెన్…“ఏది జరిగినా, దానికి ప్రతిస్పందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు.
“మేము దౌత్యానికీ సిద్ధంగానే ఉన్నాము. యావత్ ఐరోపా సుస్థిరత, భద్రతకు రష్యాతో, మా మిత్రదేశాలు, భాగస్వాములతో దౌత్యం నెరిపేందుకు సిద్ధంగా ఉన్నాము.ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే పక్షంలో మేమూ ప్రతిస్పందించేందుకు తగు విధంగా సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.
అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేసేందుకు అత్యధిక అవకాశం ఉందని జో బైడెన్ వివరించారు. అందుకే ఆలస్యం చేయకుండా ఉక్రెయిన్ను వదిలి వచ్చేయాల్సిందిగా అక్కడ ఉన్న అమెరికన్లను కోరినట్లు చెప్పారు.
ఆ కారణంగానే తమ రాయబార కార్యాలయాన్ని కైవ్ నుంచి పోలాండ్ సరిహద్దుల్లో గల పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్‌కు మార్చామని తెలిపారు. ఇదిలా ఉండగా ఐరోపాలో సంక్షోభం పెరుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెళ్లారని కూడా జో బైడెన్ తెలిపారు.