హెల్మెట్ మనకు రక్షణ కవచం. అందుకే హెల్మెట్ ప్రాధాన్యతను ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. హెల్మెట్ ధరించకపోతే చలాన్లు, జరిమానాలు విధిస్తున్నారు. చాలామంది హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా మనం చూశాం.
అందుకే ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడటంలో హెల్మెట్ తప్పనిసరి. ప్రమాదాల్లో గాయాల నుంచి మనల్ని కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపకరిస్తుంది. అయితే ఇప్పటి వరకు బైక్ పై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే రూల్ ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని కొత్త నిబంధనలను ప్రకటించింది.
ఇకపై నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్పై తీసుకెళ్తే వారికి కూడా హెల్మెట్ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల నుండి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించే వీలుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది.
అలాగే పిల్లలు వారి భద్రత కోసం బైక్ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ హార్నెస్ (బెల్ట్ లాంటిది) ఉండాలని ఆదేశించింది. తొమ్మిది నెలల నుండి నాలుగేళ్ల లోపు చిన్నారులను బైక్పై తీసుకెళ్తే.. వారికి క్రాష్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, స్పీడ్ 40 కెఎంపిహెచ్కి మించరాదని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ కొత్త రూల్స్ ఎవరైన ఉల్లంఘిస్తే వారిపై రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని కేంద్రం స్పష్టం చేసింది.
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 కి సవరణ ద్వారా కొత్త నియమాలు ప్రతిపాదించారు. కొత్తగా తెచ్చిన నిబంధనలు నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు వర్తించనున్నాయి. పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ఏదైనా బైక్ గంటకు గరిష్ఠంగా 40 కిమీ కంటే మించిన వేగంతో ప్రయాణించకూడదని కేంద్రం పేర్కొంది.