ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బిజెపి గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు వెళ్లడంతో కమీషన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయమై రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలని కోరింది.
యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాచరు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు.
మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ.. యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్‌లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.
అయితే, ఎన్నికల కమిషన్ నోటీసు అందిందని చెబుతూ తానేమి తప్పుగా మాట్లాడలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ పాలనలో జరిగిన విషయాలను ప్రస్తావించానని, యూపీలో ఒకప్పటి గూండా రాజ్యం గురించి మాట్లాడానని పేర్కొన్నారు.
హిందూ రైతుల భూములను కబ్జా చేసి, వారి నుంచి డబ్బులు దోచుకున్న గూండాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కట్టడి చేశారని చెప్పానని గుర్తు చేశారు. యోగి, అఖిలేష్ పాలన మధ్య ఉన్న తేడాను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. ఇలా ఉండగా, యోగి మళ్లీ సీఎం కావాలని రాజస్థాన్ ఉజ్జయినీ దేవాలయంలో యజ్ఞం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
కాగా, యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సిఎం కెసిఆర్ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని, ఇసి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.