అహ్మదాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో 38 మందికి మరణ శిక్ష విధిస్తూ 14 ఏళ్ళ తర్వాత శుక్రవారం ప్రత్యేక కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేలుళ్ళ కేసులో దోషులుగా తేలిన మరో 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది.
ఒకేసారి 38 మందికి ఉరి శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. గతంలో ఒక కేసులో ఒకేసారి 26 మందికి మరణశిక్ష విధించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2008 జులై 26న కేవలం 70 నిముషాల వ్యవధిలో వరుసగా 22 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ పేలుళ్ళలో మరణించిన వారి పిల్లలకు లక్ష రూపాయిలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్.పటేల్ ఆదేశించారు.
2017 జూన్ 14 నుండి ఈ కేసు విచారణను పటేల్ చేపట్టారు. దాదాపు 7 వేలకుపైగా పేజీలు గల తీర్పును న్యాయమూర్తి వెలువరించారు. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. నగరంలో జరిగిన పేలుళ్ళ కేసులో పాత్ర వుందంటూ 49 మందిని దోషులుగా ఈ నెల 8న కోర్టు నిర్ధారించింది. మరో 28 మందిపై సరైన సాక్ష్యాధారాలు లేక విడిచిపెట్టింది.
యుఎపిఎ, ఐపిసి, ఆయుధ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరికి శిక్షలు విధించారు. 49 మందికి విధించిన శిక్షలు ఏక కాలంలో అమలవుతాయని కోర్టు పేర్కొంది. వేర్వేరుగా ఎనిమిది జైళ్ళలో వును దోషులందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు, ఢిల్లీలోని తీహార్, భోపాల్, గయ, బెంగళూరు, కేరళ, ముంబయిల్లోని జైళ్ళలో వీరందరూ వున్నారు.
గతేడాది సెప్టెంబరులో 77 మంది నిందితులపై కోర్టు విచారణ పూర్తి చేసింది. మొత్తం 78 మంది నిందితులు కాగా వారిలో ఒకరు అప్రూవర్‌గా మారారు. ఇండియన్ ముజాహిదీన్‌కి చెందిన 77 మందిపై 2009 డిసెంబరులో విచారణ ప్రారంభమైంది.
మరణశిక్ష పడ్డ వారిలో ప్రధాన కుట్ర దారులు మధ్యప్రదేశ్‌కు చెందిన సఫ్దర్ నాగోరి, కుమారుద్దీన్ నాగోరి, గుజరాత్ కు చెందిన ఖయాముద్దీన్ కపాడియా, జహీద్ షేక్, షంషుద్దీన్ షేక్ ఉన్నారు.
ఆ తర్వాత మరో నలుగురిని అరెస్టు చేశారు. కానీ వారి విచారణ ఇంకా ప్రారంభం కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మొత్తంగా ఈ కేసు విచారణలో 9 మంది న్యాయమూర్తులు పాల్గొన్నారు.