భారత నావికాదళం స్థిరమైన ప్రయత్నాలు చేస్తూ, విరామం అంటూ లేకుండా దేశ రక్షణలో అప్రమత్తంగా ఉంటోందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు.నావికాదళ శక్తి సామర్థ్యాలను సమీక్ష చేసిన అనంతరం ఆయన త్రివిధ దళాలనుద్దేశించి ప్రసంగిస్తూ మన నౌకాదళం స్వావలంబనలో అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
విశాఖ తీరం 11వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పిఎఫ్ఆర్)కు వేదికైంది. త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ సోమవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ దేశీయ నౌక ఐఎన్ఎస్ సుమిత్రపై ఆశీనులై 60 నౌకలు, 55 యుద్ధవిమానాల శక్తి సామర్థ్యాలను సమీక్షించారు.
75 ఏళ్ల దేశ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంలో పిఎఫ్ఆర్ వేడుక జరగడం మన నౌకాదళ శక్తిసామర్థ్యాలను దేశానికి తెలియజేసే గొప్ప ఈవెంట్‌గా నౌకాదళం భావిస్తోంది. బంగాళాఖాతంలో ఈ నౌకలు రంగురంగులతో అలంకరించబడి సముద్రంపై అత్యంత వేగంగా వరుసగా కదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పైనుంచి యుద్ధవిమానాలు, ఫ్లై పాక్‌లు, హాకర్స్ భారీ శబ్దాలను చేసుకుంటూ రాష్ట్రపతి దృష్టిని ఆకర్షించాయి. భారత నౌకాదళం శక్తిసామర్థ్యాలను దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియజేసేలా ఏటా ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఏ విధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేపడతాయో ఈ పిఎఫ్ఆర్ వేడుకలో కూడా 21 గన్ల శాల్యూట్‌ను రాష్ట్రపతి తీరంలో అందుకున్నారు.
రాష్ట్రపతిని తొలుత దేశ త్రివిధ దళాధిపతులు సుమిత్ర నౌకలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దేవుసిన్హ్ జే చౌహాన్, భారత నౌకాదళ అధిపతి ఆర్.హరికుమార్, తూర్పునౌకాదళం అధిపతి బిశ్వజిత్ దాస్ గుప్తా ఉన్నారు. 12వ పిఎఫ్ఆర్కు గుర్తుగా స్టాంప్‌ను రాష్ట్రపతి విడుదల చేశారు.
విశాఖ తీరం, బంగాళాఖాతం సముద్రం మధ్యలో రంగురంగులతో అలంకరించబడిన బోట్లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకుతూ పరేడ్ ప్రదర్శనలూ నిర్వహించాయి. పలు జలాంతర్గాములు కూడా రాష్ట్రపతి ఆశీనులైన సుమిత్ర నౌకవైపు కదులుతూ గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తెలిపాయి.
సముద్రంలో ఎవరైనా పడిపోతే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయొచ్చో యుద్ధవిమానాలు, హాక్ విమానాలు ఏరోబేటిక్స్ ద్వారా చూపించాయి. విమానంలోంచి తాడు ద్వారా సముద్ర జలాల్లోకి దిగే ప్రక్రియ ఆకట్టుకుంది. హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈ ఈవెంట్లో ప్రతిభ చూపాయి. మెరైన్ కమాండో (మార్కోస్)లు వాటర్ పారా జంపింగ్స్ నిర్వహించారు.
55 ఫ్లై పాస్ట్ యుద్ధ విమానాలు చేతక్‌లు, ఎఎల్‌హెచ్ సీ కింగ్స్, కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్-38ఎస్డి, పి 81, హాక్స్, మిగ్ 29 కె యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వదేశీ శక్తితో నిర్మించబడిన విమానాలు, పలు డార్నియర్లు, ఐఎన్ మిగ్ 29 యుద్ధ విమానాలు, ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ షిప్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. దేశ ప్రజలకేగాక ప్రపంచ దేశాలకూ మన సొంత శక్తి ఏమిటో తెలియజెప్పడం ఈ ఫ్లీట్ రివ్యూ ప్రధాన ఉద్దేశం.