ఉక్రెయిన్ లో యుద్ధమేఘాలు క్రమ్ముకొంటుండగా, ఆ దేశంపై దాడికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఒక వంక హెచ్చరికలు జారీ చేస్తుండగా, రెండు దేశాల అధ్యక్షుల సమావేశం కోసం మరోవంక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దౌత్య మార్గాల ద్వారా యుద్దాన్ని నివారించాలని ఫ్రాన్స్ వంటి దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఓ వైపు వివిధ దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు రష్యా సమర సన్నాహాలను ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ తాజా వివాదాన్ని గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాల పరిష్కరించలేవని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రష్యాలో చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ పౌరులను కాల్చిచంపినట్లు రష్యా సైన్యం సోమవారంనాడు ప్రకటించింది.
ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్లు శిఖరాగ్ర సమావేశానికి అంగీకరించారని ఫ్రాన్స్ ప్రకటించింది. అయితే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి చేయకూడదన్న షరతు మేరకు ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది. యుద్ధాన్ని నివారించేందుకు దౌత్య విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రతిపాదించిన శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నేతలు సూత్రప్రాయంగా అవును అనిచెప్పారని ఫ్రాన్స్ అధికారిక కార్యాలయం తెలిపింది. బైడెన్ అంగీకరించారన్న విషయాన్ని వైట్‌హౌస్ ధృవీకరించింది. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదని పేర్కొన్నారు.
ఈ భేటీకి సంబంధించి గురువారం నుండి సన్నాహాలు ప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉక్రెయిన్‌లో బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం వార్తలను రష్యా ఖండిస్తోంది.
మరోవంక, ఉక్రెయిన్ సంక్షోభంపై వ్లాదిమిర్ పుతిన్, జోబైడెన్‌ల శిఖరాగ్ర సమావేశం త్వరగా జరగాలని కోరుకుంటున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు భేటీ కానున్నారని ఫ్రాన్స్ పేర్కొన్న తర్వాత.. ఈ ప్రకటన వెలువడింది.
ఈ సదస్సును ఫ్రాన్స్ ప్రతిపాదించగా.. పుతిన్‌తో బైడెన్ భేటీ అయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని తెలిపింది. అయితే బైడెన్‌తో భేటీ కావాలనుకుంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడకూడదన్న ఒప్పందంపై ఫ్రాన్స్ ఈ సదస్సును ప్రతిపాదించింది.
కాగా, దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి మిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఏ విధమైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఏదైనా నిర్థిష్ట ప్రణాళికల గురించి చర్చించడంపై అవగాహన ఉందని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాలన్న అవగాహన తమకుందని తెలిపారు.
అయితే అధ్యక్ష శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పారు. అవసరమైతే.. రష్యా, అమెరికా అధ్యక్షులు చర్చించాలనుకుంటే టెలిఫోన్ కాల్ లేదా ఇతర పద్ధతులను నిర్వహించవచ్చునని సూచించారు.
మరోవంక, ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం కావడంపై ఐక్యరాజ్యసమితి మంగళవారం అత్యవసర భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. డాంటెన్క్, లుగాన్క్స్ ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ దృష్ట్యా సైన్యాన్ని మోహరించాలని రష్యా ఆదేశించడంతో తాము చాలా నాటకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్న ఫ్రాన్స్ రాయబారి నికోలస్ డి రివియర్ ఈ సమావేశానికి హాజరయ్యే ముందు విలేకరులతో తెలిపారు. ఉక్రెయిన్ ప్రోద్బలంతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన కొన్ని దేశాలలో ఫ్రాన్స్ కూడా ఉంది.
ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దు నుంచి వేలాది మంది సైనిక బలగాలను వెనక్కి తీసుకుంటానని ఇదివరకు చేసిన వాగ్దానాన్ని రష్యా ఆదివారం వెనక్కి తీసేసుకుంది. ఉక్రెయిన్‌కు ఉత్తరాన ఉన్న పొరుగు నగరం బెలారస్‌కు రష్యా 30 వేల సైన్యాన్ని ఇటీవల తెచ్చింది.
ఉక్రెయిన్ సరిహద్దులో ఇప్పటికే లక్షన్నర సైనిక బలగాన్ని మోహరించి ఉంచింది. అంతేకాక అక్కడ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి, ఇతర యుద్ధ సామాగ్రిని చేర్చింది.