ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో జరుగవలసి ఉంది. అయితే ఈ లోపుగానే, వచ్చే ఏడాది ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాసహం ఉన్నట్లు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ నాయకులకు సంకేతం ఇచ్చారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్చార్జులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహిస్తూ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలో మార్గదర్శనం చేశారు. వైసీపీ దగ్గర డబ్బు, అధికారం ఉంటే.. మన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే మనకు పెట్టని కోట అంటూ భరోసా వ్యక్తం చేశారు.
అయితే, ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలని, దూరమైన వర్గాలను దరి చేర్చుకోవాలని, దీని కోసం పార్టీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ఆయన సూచించారు. జగన్‌రెడ్డి తన అసమర్థ, స్వార్థపూరిత విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బ తీశారని, రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయిందని చెప్పారు.
‘ఒక్క చాన్సుతో తెచ్చుకున్న అధికారం చివరి చాన్సు కావడం ఖాయం. ప్రతి వర్గాన్నీ దెబ్బ తీసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. పేద వర్గాలకు ఆదాయాలు పడిపోయాయి. రైతాంగం ఘోరంగా చితికిపోయింది. పండించిన పంటలకు ధర లేదు. పంటల బీమా తామే కడతామని ప్రగల్భాలు పలికి చివరకు కట్టకుండా వదిలేసి రైతులను నట్టేట ముంచారు’ అంటూ విమర్శించారు.
తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి చేస్తాడా? అంటూ ప్రశ్నించారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి కిరాతకంగా హత్యకు గురైతే హంతకులను వెనకేసుకు వస్తున్నారు. వైసీపీ నేతల అవినీతి, రౌడీయిజం, సెటిల్మెంట్లను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీటిపై పార్టీ నేతలు బలంగా పోరాడి ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు.
ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోందని, ఇప్పటికీ కదలని నాయకులను ఇక పార్టీ మోయలేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘కొన్ని చోట్ల నాయకులు బయటకు రావడం లేదని.. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి అనేకసార్లు చెప్పిచూశాం. మార్పు వస్తుందని చాలా అవకాశాలు ఇచ్చాం. ఇంకా వేచి చూడడానికి పార్టీ సిద్ధంగా లేదు’ అని తేల్చి చెప్పారు.
టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ శత జయంత్యుతవాలు, మహానాడు నిర్వహణపై పొలిట్‌బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.