పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌ను అరెస్ట్ చేశారు.
ఈ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు.
అనంతరం దక్షిణ ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఇడి కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మాలిక్‌తో పాటు ఆయన కుమారుడు, న్యాయవాది అమిర్ మాలిక్ కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలపై మహారాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పందిస్తూ ముందస్తు నోటీసు లేకుండా మాలిక్‌ను విచారించడం ద్వారా ఇడి నిబంధనలను ఉల్లంఘించిందని, ఇది అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. నవాబ్ మాలిక్ గతంలో కొందరు వ్యక్తులు చేసిన అకృత్యాలను వెల్లడించారని, దాని ఫలితంగానే ఈ రోజు ఆయనను ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు.
ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నవాబ్ మాలిక్‌ను ఈ విధంగా టార్గెట్ చేస్తారని తమకు తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు గురించి తనకు తెలియదని, అయితే ప్రత్యర్థులను అప్రతిష్టపాలు చేయడానికి దావూద్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు.
తమను వ్యతిరేకిస్తున్న వారు ముస్లిం అయితే వారికి దావూద్ తో సంబంధం అంటగట్టడం ఈ ప్రభుత్వంకు అలవాటైనదని ఆయన ధ్వజమెత్తారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ తనకు కూడా అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారని గుర్తు చేశారు. పాతికేళ్ల అనంతరం అదే చిట్కాను తిరిగి నవాబ్‌మాలిక్‌పై ప్రయోగించారని విమర్శించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దక్షిణ ముంబైలోని బల్లార్డ్ పీర్‌లోని ఈడి కార్యాలయం వెలుపల గుమిగూడి ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హవాలా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏజెన్సీ సేకరించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్లలో మాలిక్ పేరు మొదట బయటపడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దోపిడీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ విక్రయం ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ముడిపడి ఉన్న అనేక హవాలా లావాదేవీలను గుర్తించిన తరువాత ఇబ్రహీం, ఇక్బాల్ మిర్చి, ఛోటా షకీల్, పార్కర్, జావేద్ చిక్నాపై మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది.
ఏజెన్సీ తన విచారణకు సంబంధించి ఇప్పటికే ముంబైలోని కస్కర్, సలీం ఫ్రూట్, ఛోటా షకీల్ బావమరిది, ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడి నివాసాలతో సహా 10 స్థలాలను సోదా చేసింది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ బావ సలీం ఫ్రూట్, కస్కర్, పార్కర్ కొడుకులను కూడా ప్రశ్నించింది.
ఇబ్రహీం, అతని సహాయకులపై ఈడీ మనీలాండరింగ్ కేసు ఈ నెల ప్రారంభంలో డి కంపెనీపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దాఖలు చేసిన తాజా కేసు ఆధారంగా రూపొందించబడింది. ఇబ్రహీం, అతని సహచరులు భారతదేశానికి వ్యతిరేకంగా హవాలా లావాదేవీలు సహా తీవ్రవాద కార్యకలాపాలలో వారి పాత్రల ఉన్నట్లు ఎన్ఐఎ తెలిపింది.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసును బుక్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మాజీ జోనల్ హెడ్ సమీర్ వాంఖడేపై ట్వీట్ చేసినందుకు మాలిక్ ఇటీవల వార్తల్లో నిలిచారు.
శివసేన ఎంపి సంజయ్ రౌత్ స్పందిస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రేరేపణతో పని చేస్తున్నాయని ఆరోపించారు. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తాను వారి బండారాన్ని బయటపెడతానని చెప్పారు. నవాబ్ మాలిక్ నిజాలను బయటకు తీసుకొస్తున్నారని పేర్కొంటూ, వారికి (మోదీకి) వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల రూపాయలకు గోల్మాల్ చేశారని, సర్దార్ శవాలీ ఖాన్, సలీమ్ పటేల్‌ల నుంచి ఈ ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేశారని ఆరోపించారు.