ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు చెందిన టీవీ చానల్ ‘సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతిని రద్దు చేసింది. అయితే హైకోర్టును ఉద్యోగులు ఆశ్రయించడంతో తాత్కాలికంగా ఉపశమనం పొందిన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘సాక్షి’కి కేంద్ర హోం శాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ ఇవ్వకపోవడంతో అనుమతి లభించలేదు. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే చానళ్లకు కేంద్ర హోంశాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ మంజూరు చేస్తుంది.
అది ఉంటేనే ఛానల్స్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి లభిస్తుంది. స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన చానల్‌కు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఆ చానల్ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని భావించిందా? లేక జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకేనా? ఇవేవీ కాకుండా… మరేవైనా కారణాలు ఉన్నా యా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
సాక్షి టీవీ ఉద్యోగులు హుటాహుటిన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, చానల్‌ను మూసేస్తే వందలమంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ‘సాక్షి టీవీ’కి తాత్కాలికంగా ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయి.
‘సాక్షి’ టీవీకి అనుమతులు రద్దు చేస్తూ గతనెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ సంస్థ సాక్షి టీవీ పేరుతో నడిపే చానల్‌కు 2006 జూన్ 7వ తేదీన పదేళ్లపాటు అప్‌లింక్, డౌన్‌లింక్ అనుమతులు జారీ చేశాం. చానల్ ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి, అన్ని అర్హతలు ఉంటే సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపిస్తాం” అని అధికార వర్గాలు తెలిపాయి.
తొలుత ఇచ్చిన అనుమతి కాలం ముగిసిపోవడంతో సాక్షి టీవీ మరోసారి అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 జూన్ 7 నుంచి 2026 జూన్ 6వ తేదీ వరకు ప్రసారాలను అనుమతించాలని కోరింది. ఈ దరఖాస్తును కూడా కేంద్ర హోంశాఖకు పంపించారు. అయితే… సాక్షి టీవీకి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను హోంశాఖ నిరాకరించిందని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో… ‘సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి’ అంటూ ఆ సంస్థకు 2021 డిసెంబరు 31వ తేదీన షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆ సంస్థ గతనెల 13న సమాధానం ఇచ్చింది. తమ చానల్‌కు కేంద్ర హోంశాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేదో తెలియదని, ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరింది. ఈ వివరణను సమాచార, ప్రసార శాఖ పరిశీలించింది.
అయితే దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని, కొన్ని ప్రమాణాలకు లోబడి హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుంది. అదే లేకపోవడంతో సాక్షి టీవీ ప్రసారాల అనుమతిని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. ‘‘ఇందిరా టెలివిజన్ లిమిటెడ్‌కు జారీ చేసిన అనుమతిని రద్దు చేస్తున్నాం. దేశంలో అనుమతించిన ప్రైవేట్ చానళ్ల నుంచి సాక్షి టీవీ పేరు తొలగిస్తున్నాం’’ అని సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేసింది.
2 Comments
“వినాశ కాలే విపరీత బుద్ధి”
సామెత ఊరికే రాలేదు. బుద్ధి అలా వక్రించి వంకర పనులు చేయిస్తుంది.
“వినాశ కాలే విపరీత బుద్ధి”
సామెత ఊరికే రాలేదు. బుద్ధి అలా వక్రించి వంకర పనులు చేయిస్తుంది.
పోయే కాలం వచ్చి నప్పుడు ఇలాంటి ఆలోచనలే నడిపిస్తాయి