భీమ్లా నాయక్ పవన్‌ను రాష్ట్రంలో అడ్డుకోవాలని జూమ్లా నాయక్ జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం కొట్టు, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, చేపల కొట్టుతో మొదలు పెట్టి సినిమా టికెట్ల వరకు వచ్చారని ధ్వజమెత్తారు.
రెవిన్యూ అధికారుల విలువైన సమయం సినిమా థియేటర్ల బాత్ రూమ్లకి అంకితం చేసిన ఘనత సీఎం జగన్ సాధించారని దుయ్యబట్టారు. సినిమా పెద్దలకు బడ్జెట్‌ని బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని అని జూటా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కోసం ఇంత ప్రహసనం అవసరమా? అని నిలదీశారు. పాలకుడు అందరిని సమానంగా చూడాలని హితవుపలికారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే టీటీడీ భారీగా పెంచిన స్వామివారి సేవల టిక్కెట్ల ధరలు తగ్గించాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ప్రదర్శనలను అధికార బలంతో అడ్డుకోవడం దారుణమని జనసేన మైలవరం మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో థియేటర్ల వద్ద జన సైనికులు నిరసనలు వ్యక్తం చేశారు. భీమ్లా నాయక్ సినిమా పై కక్ష సాధింపు తగదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఖండించారు.
మిగిలిన సినిమాలను పట్టించుకోకుండా కేవలం పవన్ కల్యాణ్ సినిమాల పై అధికార జులుం చూపించడమేంటి ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం పై ఆధారపడినట్లు ఇకపై సినిమాల విషయంలో కూడా ప్రేక్షకులు పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వలన ఏర్పడుతుందని ధ్వజమెత్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం ఈరోజు దేశ వ్యాప్తంగా రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో విజయవాడ నగరంలోని థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కటౌట్‌కు పాలాభిషేకాలు, పూల అభిషేకాలతో అభిమానుల కోలాహలం నెలకొంది. ఉదయం 8:30 గంటలకు ఫస్ట్ షో వేయనున్నారు. జనసేన నాయకులు జై పవన్ కళ్యాణ్ అంటూ బైక్ ర్యాలీలు నిర్వహించారు.
ఏపీలో బెనిఫిట్ షోస్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఈ సినిమా ఐదు షోస్ ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ సినిమా చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హైదరాబాద్ కు తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లానాయక్’ విడుదల పండగ వాతావరణాన్ని తలపించింది.
ఏపీలో బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడంతో యానాంకు పవన్ అభిమానులు.. వాహనాలతో పోటెత్తారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి ఎస్ఎల్ఎన్ థియేటర్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. అభిమానులపై స్పెషల్ పార్టీ పోలీసుల లాఠీచార్జ్ చేయగా.. సీఎం డౌన్ డౌన్ అంటూ ఎత్తున నినాదాలు చేశారు.
‘‘ఉదయం 10లోపు ఎవరూ సినిమా వేయలేదు, వేయరు. మమ్మల్ని దొంగల్లా అవమానిస్తూ థియటర్ల వద్ద 15 మందిని కాపలా పెట్టి, దాడులు చేయటం తగదు” అని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ రాష్ట్ర ప్రభుతానికి హితవు చెప్పారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన విషాదంలో ఉన్న సమయంలో థియటర్ల వ్యవస్థపై ఈ దాడి అవసరమా? అని ప్రశ్నించారు. కరోనా కంటే తీవ్రమైన దాడి ఇదని ధ్వజమెత్తారు. దీని వల్ల పవన్ కళ్యాణ్‌కు నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు తాము పొమ్మని చెబుతూ, ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.