కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం పట్ల స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది . 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది.
టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని మంచ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్’గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఇల్కర్ ఐసీ ఉన్నారని తెలుపుతూ, అతని పూర్వ కార్యకలాపాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని కేంద్రాన్ని కోరింది.
టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓగా ఐసీని నియమించింది.
ఈ ప్రకటనపై టాటా గ్రూప్ కూడా స్పందించలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ మాట్లాడుతూ టర్కీ భారత ప్రత్యర్థి పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నందున ఐసీ నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించరాదని స్పష్టం చేశారు. భారతదేశంలో ఒక విమానయాన సంస్థకు సీఈఓగా విదేశీ జాతీయుడి నియమించడానికి ముందు ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం అని చెప్పారు.