ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. రష్యా తమపై చేస్తున్న దాడి గురించి ప్రధానికి వివరించారు. ప్రస్తుతం తమ దేశంలో లక్షమందికిపైగా రష్యా సైనికులు ఉన్నారని జెలెన్స్కీ తెలిపారు.
నిర్దాక్షణ్యంగా జనాలు నివసిస్తున్న రెసిడెన్షియల్ భవనాలపై సైతం దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. భద్రతా మండిలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని మోదీని జెలెన్స్కీ కోరారు. రష్యా దురాక్రమణను కలిసికట్టుగా అడ్డుకుందామని తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్వీట్ కూడా చేశారు. రష్యా దూకుడును ఆపాలని జెలెన్స్కీ కోరారు.
మరోవైపు ప్రధాని కార్యాలయం కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రధానికి వివరించారని పేర్కొంది.
ఆ దేశంపై రష్యా దాడుల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినందుకు ప్రధాని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారని పీఎంఓ తెలిపింది. హింసను తక్షణం నిలిపివేయాలని, చర్చలకు తిరిగి రావాలని ఆయన తన పిలుపును పునరుద్ఘాటించారు.
శాంతి ప్రయత్నాలకు ఏ విధంగానైనా సహకరించడానికి భారతదేశం తరపున ప్రధాని మోదీ సుముఖత వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరుల భద్రత పట్ల ఆందోళనను కూడా ప్రధాని ఈ సందర్భంగా తెలియజేశారు.
భారతీయ పౌరులను వేగంగా, సురక్షితంగా తరలించడానికి అవసరమైన చర్యల్ని ఉక్రెయిన్ అధికారులు మరింత సులభతరం చేయాలని ప్రధాని కోరారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవంక గత రాత్రి జరిగిన సెక్యూరిటీ కేబినెట్ కమిటీ (సీసీఎస్)లో తాజా పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయ్ శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రష్యా సైనిక చర్యల దరిమిలా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలిసింది.