ఒక వంక ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేస్తూ, తీవ్ర విధ్వసం సృష్టిస్తున్న రష్యా శాంతి చర్చలు అంటూ ప్రతిపాదించి, అందుకు తమ అధికారుల బృందాన్ని సహితం బెలారస్ కు పంపించింది.
అయితే చర్చలకు సిద్ధమైనా, చర్చల వేదికను మాత్రం ఉక్రెయిన్ తిరస్కరించింది. బెలారస్ రష్యా అనుకూల ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని రష్యా తమ దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ బెలారస్ ఆరోపించారు.
రష్యా బెలారస్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతామని ప్రకటించి గోమెల్ నగరంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.అయితే ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు.
బెలారస్ నుండి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందని, తన దేశం పట్ల దూకుడు ప్రదర్శించని ప్రదేశాలలో మాత్రమే చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. “వార్సా, ఇస్తాంబుల్ బ్రాటిస్లావా, బుడాపెస్ట్ మరియు బాకు ఉన్నాయి. ‘క్షిపణులు ఎగరని ఏ దేశంలోనైనా చర్చలకు నేను సిద్ధంగా ఉన్నాను” అని తమకు ఆమోదయోగ్యమైన ప్రదేశాలను ప్రకటించారు.
మరోవంక, ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నాలుగో రోజు భీకరంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని గ్యాస్, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పలు నగరాల్లో భారీ పేలుళ్ల మోత మోగుతుంది. తాజాగా మరో రెండు పెద్ద నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది.
దక్షిణ, ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్న రెండు పెద్ద నగారాలను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా ప్రకటించుకుంది. ఇక ఎటు చూసినా బాంబుల మోతలు..సైరన్లతో కీవ్ నగరం అట్టుడుకుతోంది. భయంతో జనం బంకర్లు, సెల్లార్లలో తలదాచుకుంటున్నారు. కీవ్ నగరంపై పట్టు కోసం రష్యన్ బలగాలు ప్రయత్నిస్తుంటే.. దాన్ని ఉక్రెయిన్ సేన అంతే తీవ్రంగా తిప్పికొడుతోంది.
ఉదయం కార్కివ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా గ్యాస్ పైల్ లైన్ ను పేల్చేశాయి. దీంతో ఆకాశంలో దట్టమైన పొగ ఏర్పడింది. ఎన్ని ప్రాంతాలు రష్యా చేతికి చిక్కాయన్న సమాచారంపై స్పష్టత కొరవడింది. పలు చోట్ల రష్యా బలగాలను తిప్పికొట్టామని, రాజధానికి సమీపంలో మాత్రం హోరాహోరీగా పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
రష్యా దురాక్రమణను తట్టుకుని నిలుస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా రవాణా విమానాన్ని కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే మరోవైపు ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధమేనని రష్యా ప్రకటిస్తున్నట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది.
ఇలా ఉండగా, ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సైనిక బలం ఉన్న దేశాల్లో ఒకటైన రష్యాను ఒంటరిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు అండగా నిలిచేందుకు ఒక్కో దేశం ముందుకొస్తోంది. యుద్ధంలో ఏ మాత్రం చలించని ధైర్యంతో పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుల్లో మరింత బలాన్ని నింపేందుకు జర్మనీ ముందుకొచ్చింది.
రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తమ వంతు సాయంగా ఆయుధాలను పంపుతామని ప్రకటించింది. వెయ్యి యుద్ధ ట్యాంకులు, 500 సర్ఫేస్ టు ఎయిర్ స్టింగర్ క్షిపణులను వీలైనంత త్వరగా ఉక్రెయిన్ చేరవేస్తామని జర్మనీ చాన్సెలర్ కార్యాలయం వెల్లడించింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోందని జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. రష్యా తీరు అన్ని దేశాలను బెదిరించేలా ఉందని, ఈ పరిస్థితుల్లో పుతిన్ దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కు మన వంతు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అలాగే 14 ఆర్మ్డ్ వెహికల్స్, పది వేల టన్నుల ఫ్యూయల్ పంపుతామని జర్మనీ ఎకానమీ మంత్రి ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్ కు సుమారు రూ.7,500 కోట్ల ఆర్థిక సాయాన్ని చేస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధంలో అవసరమయ్యే డిఫెన్సివ్ ఎక్విప్ మెంట్ ను ఉక్రెయిన్ కు పంపేందుకు ఇటలీ ముందుకొచ్చింది. రష్యా యుద్ధోన్మాదాన్ని అడ్డుకోవడానికి 8.6 మిలియన్ డాలర్ల మెషిన్ గన్స్, ఆటోమెటిక్, స్నిపర్ రైఫిల్స్, పిస్టల్స్, మందు గుండు సామాగ్రిని పంపిస్తామని చెక్ రిపబ్లిక్ ప్రకటించింది.
అలాగే నెథర్లాండ్స్ 400 యాంటీ ట్యాంక్ వెపన్స్ ను ఉక్రెయిన్ కు సాయంగా పంపుతామని తెలిపింది. ఫ్రాన్స్ కూడా ఆయుధ సాయంచేసే ప్రతిపాదనపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ దేశం యుద్ధానికి ముందే వందల మిలియన్ల విలువ చేసే ఆయుధాలను పంపింది.
చివరకు బతికుంటే చాలు దేవుడా.. అనుకుంటూ లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని, పిల్లాపాపలను తీస్కుని పక్కదేశాలకు వలసపోతున్నరు. పోలాండ్, మాల్డోవా, హంగేరీ, రుమేనియా, స్లొవేకియా దేశాలకు ఇప్పటికే 1.20 లక్షల మంది వలసపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఒక్క పోలాండ్ బార్డర్ వద్దకే రెండ్రోజుల్లో 1.16 లక్షల మంది రెఫ్యూజీలు వచ్చారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.