జీతాలు పెంచాలని తాము కోరడం లేదని, ప్రస్తుతం ఉను జీతాలను తగ్గించవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఏడు ప్రధాన సమస్యలను ప్రస్తావించిన ఈ లేఖను జోసఫ్ సుధీర్‌బాబు, రఘునాథరెడ్డి, కెఎస్ఎస్ ప్రసాదు, నక్కా వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, భానుమూర్తి, కులశేఖరరెడ్డి, గణపతిరావు, శౌరిరాయలు, సాల్మన్‌రాజు, అశోక్ కుమార్ సోమవారం విడుదల చేశారు.
మంత్రుల కమిటీతో పిఆర్సి పై జరిగిన చర్చల ఒప్పందాలకు సంబంధించి హామీల మేరకు జిఓలు విడుదల చేయాలని లేఖలో కోరారు. ఫిట్మెంట్ 27 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పిఆర్సిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఓపెన్ బ్యాలెట్లో ప్రభుత్వం తీరుపై ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు.
ఈ సందర్భంగా జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ పిఆర్సిపై నియమించిన మంత్రుల కమిటీ సమావేశంలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విబేధించి తాము బయటకువచ్చామని తెలిపారు. అనంతరం చర్చల హామీ మేరకు నిర్ణయాలపై జిఓ విడుదల చేస్తామన్నారని, ఇంతవరకు విడుదల చేయలేదని విచారం వ్యక్తం చేశారు.
ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉన్నందున రూ.5,400 కోట్ల వరకూ రికవరీ చేయాల్సి ఉంటుందని తెలిపారని, దీనిని రికవరీ చేయబోమని జిఓ ఇస్తామని చెప్పారని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. చర్చలకు ముందు పదేళ్లకోసారి పిఆర్సి వేస్తామని ఉత్తర్వులు ఇచ్చారని, ఆందోళన ఫలితంగా జరిగిన చర్చల్లో దానిని ఐదేళ్లకు తగ్గిస్తామని చెప్పారని, దీనికి సంబంధించి కూడా ఇంతవరకు ఉత్తర్వులు రాలేదని గుర్తు చేశారు.
దీనికి నిరసనగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిఎస్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అలాగే సిఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ లేఖ రాయాల్సివచ్చిందని తెలిపారు.
యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాదు మాట్లాడుతూ రెండు లక్షలమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం తాము సిఎంకు బహిరంగ లేఖ రాస్తున్నామని చెప్పారు. సిపిఎస్‌ను రద్దు చేయలేదని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందనే నిర్ణయానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గామ, వార్డు సెక్రటరీలకు క్లర్కు కంటే దిగువస్థాయి వేతనాలు ఇస్తూ డిపార్టుమెంటు పరీక్షలు నిర్వహిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. రూ 12,500 కోట్లు పిఆర్సి రూపంలో ఇచ్చామని చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.