కొంత కాలంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడులను తీవ్రతరం చేయడమే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ పై దిక్కారధోరణి వ్యక్తం చేస్తున్నారు. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 7 నుండి జరపడానికి సిద్దపడుతున్నారు.
గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, ప్రభుత్వం తరఫున మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ఆ తర్వాత మేడారంలో గవర్నర్‌కు ప్రొటోకాల్ పాటించలేదన్న వివాదాల నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సోమవారం అత్యున్నత అధికార సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే కేంద్రంపై ప్రారంభించిన రాజకీయ పోరాటం దృష్ట్యా గవర్నర్ ను రాష్ట్రంలో నిమిత్తమాత్రురాలిని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది. గవర్నర్ ఎక్కడ మాట్లాడినా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వం పనితీరును పొగడ్తలతో ముంచెత్తడమే గాని రాష్ట్ర ప్రభుత్వం గురించి మాటమాత్రంగా కూడా మంచి మాటలు చెప్పడం లేదని కొంతకాలంగా అధికార పక్షం నేతలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడుతున్న వివాదాలపై ఇప్పటి వరకు దాదాపు మౌనంగా ఉంటూ వస్తున్న డా. తమిళశై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదేవ్ దినక్కర్ వలే ప్రతిఘటించే ప్రయత్నం చేస్తారా? సోషల్ మీడియాలో, మీడియా ప్రకటనలతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగుతారా? చూడవలసి ఉంది.
సాధారణంగా సమావేశాల ప్రారంభ ఉత్తర్వులను గవర్నర్ జారీ చేయవలసి ఉంటుంది. అయితే, గత అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడంతో గవర్నర్ ప్రమేయం లేకుండా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగానే శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులుతో ఉత్తర్వులను జారీ చేయించింది.
సెప్టెంబరు 24న ప్రారంభమై అక్టోబరు 8న ముగిసిన గత సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారే తప్ప గవర్నర్ ప్రొరోగ్ చేయలేదు. దీంతో ఆ ఎనిమిదవ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నట్లుగానే భావిస్తూ, ఆ సాంకేతిక కారణంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరపబోతున్నారు.
మార్చ్ 7వ తేదీనుంచి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది తర్వాత జరిగే శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారని సీఎంవో తెలిపింది. సమావేశాల ప్రారంభం రోజున ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఈ బడ్జెట్‌కు ముందస్తుగా అనుమతి తెలిపేందుకు ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో క్యాబినెట్ సమావేశమవుతుంది. ఈ నెల 7 నుంచి రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయంటూ శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.
గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని శాసనమండలికి నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకొని ప్రచ్ఛన్న పోరు కొనసాగుతున్నది.
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారా? రాష్ట్ర తొలి పౌ రురాలిని గౌరవించే తీరు ఇదేనా? అని నిలదీశారు. సీఎం నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలిపేలా ఉందని ధ్వజమెత్తారు.
1 Comment
A highly reputed and dignified Constitutional Office of the Governor, designed with very great diligence and entrusted with highly vulnerable responsibilities by the Founding Father’s, over decades is degraded as to invite on itself this kind of neglect by the Chief Ministers of various States! Excepting in very rare cases and instances, It is precisely the functioning of the Centre and the Governors over decades that is to blamed for the present predicament wherein Chief Ministers are openly rebelling against the Governors/ Center.