ఒక వంక, ఉక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా సాగిస్తున్న ముప్పేట దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు, మరోవంక అణ్వాయుధాలతో రష్యా చెలగాటం ఆడుతున్నదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అణ్వాయుధాలతోనే జరుగుతోందని అంటి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించడం బెదిరింపు ధోరణిగానే భావిస్తున్నారు.
నాలుగైదు రోజులతో ఉక్రెయిన్ ప్రభుత్వం లొంగి పోతుందని ఆశించిన రష్యాకు, ప్రపంచ దేశాలు ఏవీ జోక్యం చేసుకోవడానికి సుముఖంగా లేకపోయినప్పటికీ, పది రోజులు దాటినా తీవ్ర ప్రతిఘటన ఇస్తుండడం పట్ల కొంతమేరకు అసహనంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే అణ్వస్త్రాల గురించి ప్రస్తావిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం జపోరిజియా పై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించడంతో ప్రపంచమే వణికి పోయింది. ఆ కేంద్రం మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశాయి.
జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం రష్యా ఆధీనంలోకి వెళ్లినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయి పెరగక పోవడం కొంత ఉపశమనం కలిగిస్తున్నది. ఈ సందర్భంగా 1986లో చోటుచేసుకున్న చెర్నోబిల్ విపత్తు గురించి అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రస్తావించారు.
ఈ ఘటన గురించి ప్రపంచ మొత్తానికి తెలుసునని, ఆ అణువిద్యుత్ కేంద్రం పేలుడు వల్ల ఎంత మంది చనిపోయారో, క్షతగాత్రులయ్యారో తెలుసునని, ఆ పరిణామాలకు అనేక మంది బాధితులయ్యారని, అనేక మంది తరలించబడ్డారని గుర్తు చేశారు. ఇదే రష్యా పునరావృతం చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు.
అణువిద్యుత్ కేంద్రంపై దాడుల పట్ల దాడుల గురించి అమెరికా, బ్రిటన్, కెనడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడారు. ఈ దాడి వల్ల ఐరోపా ఖండానికే ముప్పుం ఉందని బ్రిటన్ ప్రధాని మండిపడ్డారు.
మరోవంక, ఉక్రెయిన్ పై మిసైల్స్, రాకెట్లతో దాడి కొనసాగిస్తోంది రష్యా. తొమ్మిది రోజుల నుంచి ఇప్పటివరకు రష్యా మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో రష్యా విజయవంతమైన, ఉత్తర ప్రాంతాలో రష్యా సేనలను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్నది.
మొత్తం మిసైల్స్ లో 230… ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా భూభాగం నుంచి 150, బెలారస్ నుంచి 70, బ్లాక్ సీ నుంచి నౌకల ద్వారా మరిన్ని ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా దాడులను ఉక్రెయిన్ క్షిపణి విధ్వంసంక దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అమెరికా తెలిపింది.