రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఆంక్షలు విధించడం అంటే రష్యాపై యుద్ధం ప్రకటించడంగానే భావిస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా వారిపై కూడా తాము యుద్దానికి సిద్దపడవలసి వస్తుందనే హెచ్చరిక చేసారు.
అయితే మొదటి రెండు విడతల చర్చలు రెండు దేశాల మధ్య విఫలమైనా, తిరిగి సోమవారం మూడో విడత జరుగనున్నాయి. దానితో యుద్ధ విరమణకు మార్గం ఏర్పడగలదని పలు దేశాలు ఆసింస్తున్నాయి.
ఉక్రెయిన్ లో ‘నో ఫ్లై జోన్’ను ప్రకటించే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ అదికూడా యుద్ధంలోకి దిగినట్లే కాగలదని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను డీమిలిటరైజేషన్, డీనాజిఫికేషన్ చేయడం ద్వారా ఆ దేశాన్ని తటస్థంగా మార్చాలని, తద్వారా ఉక్రెయిన్ లోని రష్యన్ మాట్లాడే ప్రజలకు రక్షణ కల్పించాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మిలటరీ ఆపరేషన్ లో ప్రొఫెషనల్ సోల్జర్లు మాత్రమే పాల్గొంటున్నారని, ఇతర ఎలాంటి గ్రూపులూ పాల్గొనడంలేదని కూడా వెల్లడించారు. అంతా తాము అనుకున్న ప్రకారమే జరుగుతోందని చెబుతూ తాము లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రష్యాలో మార్షల్ లా లేదా ఎమర్జెన్సీ విధిస్తారన్న వార్తలను పుతిన్ కొట్టిపారేశారు.
అయితే, ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ చేపట్టేందుకు పుతిన్ చేస్తున్న వాదనలు అర్థంలేనివని ఇదివరకే ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు కొట్టిపారేశాయి. మరోవైపు ఉక్రెయిన్లో నో ఫ్లై జోన్ ను ప్రకటించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వినతిని కూడా నాటో దేశాలు ఇదివరకే తిరస్కరించాయి.
ఇలా ఉండగా, భీకర యుద్ధంలో కొంచెం విరామం ఇచ్చిన రష్యా ఉక్రెయిన్లోని మరియుపోల్, వోల్నోవాఖాలోని ప్రజలను సిటీల నుంచి బయటికి తరలించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకుంది. దీనికోసం హ్యూమన్ కారిడార్లను తెరుస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ శనివారం తెలిపింది.
మాస్కో టైం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్పులు జరపబోమని చెప్పింది. కానీ రష్యా తన మాట నిలబెట్టుకోలేదని, షెల్లింగ్ను నిరంతరం కొనసాగించిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. కాల్పుల విరమణ సమయంలోనూ మరియుపోల్పై రష్యా బాంబు దాడులను కొనసాగించింది.
దీంతో 2 లక్షల మందికిపైగా పౌరుల తరలింపు ప్రణాళికను ఉక్రెయిన్ రద్దు చేసుకుంది. ఇచ్చిన హామీని పుతిన్ బలగాలు ఉల్లంఘించాయని, ప్రజలు వెనుదిరగాలని సిటీ మేయర్ బోయ్చెన్కో కోరారు. ‘బాంబులు వేస్తూనే ఉన్నారు. ఆర్టిలరీని వాడుతూనే ఉన్నారు. మరియుపోల్ సిటీలో, సిటీకి వెళ్లే దారిలో కాల్పుల విరమణ అనేదే లేదు. షెల్లింగ్ మధ్య ప్రజలు ఎలా వెళ్లగలరు?’ అని డిప్యూటీ మేయర్ సెర్హీయ్ ఒర్లోవ్ ప్రశ్నించారు.
కాల్పుల విరమణపై రష్యాతో చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. అయితే రష్యా వాదన మరోలా ఉంది. మరియుపోల్, వోల్నోవాఖా దగ్గర్లో ఏర్పాటు చేసిన హ్యూమన్ కారిడార్లను ఎవరూ ఉపయోగించుకోలేదని రష్యా రక్షణ శాఖ చెప్పింది.
ఇలా ఉండగా, ఇప్పటివరకూ జరిగిన చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధిగా వచ్చిన డెనిస్ కిరీవ్ ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కాల్చి చంపిందని రష్యా పేర్కొంది. రష్యాకు సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలతో డెనిస్ కిరీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో కిరీవ్ మరణించాడని రష్యా వర్గాలు తెలిపాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు జరిగిన సమయంలో డెనిస్ కిరీవ్ చివరిసారిగా దర్శనమిచ్చాడు. అయితే, అతడిని సెక్యూరిటీ దళాలు కాల్చి చంపాయన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.