ఒక వంక,ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా, ఆ రెండు దేశాల మధ్య రాజీ కుదర్చడం ద్వారా యుద్దానికి ముగింపు పలకడం కోసం ఇజ్రాయిల్ ప్రయత్నం ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ చొరవ తీసుకొని ఇరు దేశాల అధ్యక్షులతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.
మొదటగా, శనివారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసి మూడు గంటల పాటు చర్చించారు. దీనికి ముందు రష్యాతో చర్చించాలని ఇజ్రాయెల్‌ను ఉక్రెయిన్ కోరింది. అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెదిలే దేశమైన ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించింది. అయినప్పటికీ పుతిన్‌తో సమావేశం అవ్వడం గమనార్హం.
పైగా ఈ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధినేతతో సమావేశమైన మొదటి దేశాధినేత ఇజ్రాయెల్ ప్రధాని మాత్రమే. పుతిన్‌తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో బెన్నెట్ మాట్లాడినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యా, ఉక్రేనియన్ నాయకులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య రెండు దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మూడవ ప్రత్యామ్నాయం కావాలని చాలా మంది సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే ఆతృత నెలకొంది. 11 రోజులుగా యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది.
ముందుగా యుద్ధం ఆపేసి చర్చలు చేయాలని అంటున్నారు. అయితే ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం ఎంత కాలం కొనసాగుతుందనే అనుమానాలు లేకపోలేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి. మరోవంక సోమవారం రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మూడో విడత చర్చలు జరుగనున్నాయి.
మరోవంక, రష్యా, ఉక్రెయిన్ మధ్య న్యాయమైన చర్చలతోబాటు అమెరికా, నాటో, ఇయు, రష్యా మధ్య సమస్థాయి చర్చలను చైనా ప్రోత్సహిస్తుందని చైనీస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దేశాల మధ్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారానికి ఇవి అవసరమని స్పష్టం చేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు దౌత్యం నెరపగలిగే స్థితిలో పశ్చిమ దేశాలు లేవని పరోక్షంగా ఇజ్రాయిల్ ను ప్రస్తావిస్తూ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో చైనాయే ఆ పాత్ర పోషించాలని ఇయు అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఇయులోని చైనా దౌత్య ప్రతినిధి బృందం ఈ విధంగా స్పందించింది.
యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ, రష్యా, చైనా మధ్య చర్చలకు రాయబారం చేయగలిగే స్థితి పశ్చిమ దేశాలకు లేదని, చైనా అయితేనే ఈ పని సమర్థంగా చేయగలదని తెలిపారు. తదుపరి శాంతి చర్చలకు చైనాయే దౌత్యం నెరపాలని ఇయు ప్రతినిధి సూచించారు.
ఇలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్లో మాట్లాడారు. నాటోలో చేరకపోవడంతో పాటు తాము గతంలో చేసిన డిమాండ్లకు ఉక్రెయిన్ పూర్తిగా అంగీకరిస్తేనే సైనిక చర్యలు ఆపుతామని పుతిన్ తేల్చి చెప్పారు. కేవలం బలగాలను సమీకరించుకునేందుకు ఉక్రెయిన్ సంప్రదింపులను పొడిగిస్తూ పోతే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు.
తదుపరి విడత చర్చల్లో అయినా ఉక్రెయిన్ నిర్మాణాత్మక చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. విదేశీ భాగస్వాములతో కూడా చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌తో ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పుతిన్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ విఫలం కాకతప్పదని స్పష్టం చేశారు.