తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రూ.2.56 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని తెలిపారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైందని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సిఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళుతున్నారని, రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర అని అభివర్ణించారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందని, అవినీతి రహితంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వడం లేదని, రాష్ట్రం పట్ల వివక్షత చూపుతున్నదని హరీష్ ఆరోపించారు.
సవాళ్ళు క్లిష్టమయిన పరిస్థితులను అధిగమిస్తున్నామని పేర్కొంటూ విద్యుత్ కోతల నుంచి విముక్తి కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేసారు. ఇది పేదల బడ్జెట్ అని చెప్పారు. క్యాపిటల్ వ్యయం రూ.29,728.44 కోట్లు. రెవిన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు అని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
జహీరాబాద్ నిమ్స్ కు కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వలేదని, ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళిత బంధుకు రూ.17,700 కోట్లు. పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు. పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించారు.
పేదలు అభివఅద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకెళుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించారని చెబుతూ అందుకే ప్రతి పథకం వారికి అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ పేదల కోసం పథకాలు అవలంభిస్తున్నామని వివరించారు.
దళిత జాతి అభ్యున్నతికి దళిత బంధు పథకం ఒక దిక్సూచీలాంటిదని పేర్కొన్నారు. దళిత జాతి ఆర్థిక ప్రగతికి ఇది సాధనం కానుందని భరోసా వ్యక్తం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి ఉపాధికోసం రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎస్టీ సంక్షేమం రూ.12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం రూ.5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ.177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, శది ముబారక్ లకు రూ.2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయింపు చేసినట్లు హరీష్‌రావు వివరించారు.
కేంద్రంపై మండిపాటు
రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తోందని ఆరోపిస్తూ ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపిందని హరీష్ మండిపడ్డారు. అక్రమ బదలాయింపుతో తెలంగాణ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయిందని తెలిపారు. హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం చేసిందని గుర్తు చేశారు.
విభజన హామీలు అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు. బిడ్డను బతికించారు అంటూ కేంద్ర పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌పై అన్యాయం చేసిందని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని వివరించారు.
నీతి అయోగ్ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని హరీష్ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపు ఇవ్వడం లేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అతీగతీ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన రో 495 కోట్లను ఏపీ ఖాతాలో జమ చేసిందని మండిపడ్డారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుకు విద్యుత్ సంస్కరణకు లంక పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రూ 25 వేల కోట్లు తెలంగాణ నష్టపోయిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.