తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజుననే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందనరావులను సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
ముఖ్యంగా టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెన్నంటి ఉంటూ, ఆ పార్టీలో కీలక నేతగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి, ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీకి మొదటిసారిగా వచ్చిన కొద్దీ నిముషాలకే సస్పెండ్ కావడం గమనార్హం.
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ను సమర్పిస్తూ సమావేశాలు జరగడానికి వీల్లేదని అంటూ వారు ముగ్గురు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తుండగా, వారిని సస్పెండ్ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించడం, ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలపడం జరిగిపోయింది.
మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెన్షన్ చేయడంతో, వారిని సభ లోనుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లారు. సభలో సస్పెన్షన్కు నిరసనగా నల్ల కండువాలు ధరించిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు మందు కూర్చొని ధర్నా చేపట్టారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత వారిని అక్కడి నుండి విడిచిపెట్టారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అయితే తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అరెస్టును బీజేపీ నాయకత్వం సీరియస్గా పరిగణిస్తోంది. ప్రభుత్వం బీజేపీపై కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తోందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని బీజేపీ భావిస్తోంది.
ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సందర్భంగా విమర్శించారు. తాము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అసెంబ్లీలో ఉంటే తమ హక్కుల్ని కాలరాస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలను సెషన్ అంతా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగంగానే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
మహాత్మాగాంధి విగ్రహం దగ్గర నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంటూ తమ హక్కులను హరించే హక్కు సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గౌరవ సభ్యులమని కూడా చూడకూండా మమ్మల్ని అసెంబ్లీ ఆవరణ నుంచి పోలీసులు ఏ విధంగా అరెస్టు చేస్తారని నిలదీశారు. హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ కూడా స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.