”గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పాం. 20 ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పకర్కు పదేపదే గుర్తు చేశాను. మా సీట్లో ఉండి నిరసన తెలిపితే సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు.” అని హుజురాబాద్ బీజేపీకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదని చేసిన ఆరోపణలపై ఈటెల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వాలు నడుస్తాయి తప్పితే.. కేంద్రప్రభుత్వం నిధులతో కాదనే విషయాన్ని హరీష్‌రావు గుర్తించుకోవాలని హితవు చెప్పారు.
”బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 20 రోజులకుపైగా జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం” అని తెలిపారు.
కిరాయి భవనాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి తప్పితే సొంత భవనాలు లేవు. పాఠశాలలు బంజరు దొడ్డిలా ఉంటే నాణ్యమైన విద్య అందుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అంకెల గారడీ. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు.
మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.37 వేల కోట్లు. గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించి యువకులను మద్యానికి బానిస చేస్తున్నారు. యువశక్తి గంజాయి, లిక్కర్‌కు బానిస అవుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చకు సిద్దం అని సవాల్ చేశారు. బడ్జెట్‌పై తాను మాట్లాడితే బండారం బయట పడుతుందనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని రాజేందర్ ఆరోపించారు. తనకు చట్టం మీద సంపూర్ణమైన అవగాహన ఉందని చెబుతూ, సస్పెన్షన్‌పై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.
హైకోర్టు ను ఆశ్రయించిన బిజెపి ఎమ్యెల్యేలు
రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్‌పై హైకోర్టులో మంగళవారం ఉదయం ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
అలాగే సస్పెషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని తెలిపారు.
సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని బీజేపీ నేతలు కోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని పేర్కొన్నారు. ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు.