రష్యాకు చెందిన ఆయిల్ దిగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండడంతో, దీనిని సాకుగా తీసుకొని ఆ దేశంలోని గ్యాస్ వంటి సహజవనరుల సంస్థలలో పెట్టుబడులు కొనడం, పెంచే అంశాలను చైనా పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ మీడియా తెలిపింది. రష్యన్‌లోని ప్రధాన గ్యాస్ ఎగుమతి దారు గాసోప్రోమ్, అల్యూమినియం ఉత్పతిదారు రుసల్ సంస్థలలో చైనా ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టేందుకు యత్నిస్తోందని తెలిపింది.
చైనా నేషనల్ పెట్రోలియం కార్పోరేషన్, చైనా పెట్రోకెయికల్ కార్పోరేషన్, అల్యూమినియం కార్పోరేషన్ ఆఫ్ చైనా, చైనా మినరల్స్ కార్పోరేషన్ సంస్థలతో పెట్టుబడులకు సంబంధించి రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం చర్చలు ప్రారంభదశలో ఉన్నాయని, అయితే చైనీస్, రష్యా ఇంధన సంస్థల మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న సైనిక దాడుల నేపథ్యంలో పలు పశ్చిమ దేశాలు గత కొన్ని రోజులుగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాకు దిగుమతయ్యే రష్యా చమురు, గ్యాస్‌లపై ఆంక్షలు విధించనున్నట్లు బుధవారం వాషింగ్టన్ ప్రకటించింది.
జర్మనీ ఆంక్షలు పాటించకపోవచ్చు!
అయితే, రష్యానుండి దిగుమతయ్యే చమురు, గ్యాస్‌లపై జర్మనీ ఆధారపడి ఉందని, దీంతో దిగుమతులపై ఆంక్షలు విధించాలన్న అమెరికా, బ్రిటన్ల ఆదేశాలను పాటించకపోవచ్చని ప్రముఖ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. రష్యా చమురు దిగుమతులు నిలిచిపోతే తమ దేశం ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బెర్బాక్ వెల్లడించారు. దానితో రష్యాకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.
రష్యా నుండి చమురును కొనుగోలు చేయడాన్ని అమెరికా, బ్రిటన్లు నిలిపివేస్తామని ప్రకటించాయని, అయితే జర్మనీ ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఆలోచిస్తోందని చెప్పారు. చమురు దిగుమతులలో మూడోవంతు రష్యా నుండే వస్తున్నాయని మీడియాకు వివరించారు. ఈ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే. భవిష్యత్తులో తమ దేశం ఆర్థికంగా పురోగమించలేదని స్పష్టం చేశారు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రష్యా చమురు దిగుమతులపై విధించే ఆంక్షలను అడ్డుకునేందుకు జర్మనీ ప్రభుత్వం యత్నిస్తోంది. యూరోపియన్ ఇంధన భద్రతకు రష్యా చమురు, గ్యాస్ అత్యవసరమని జర్మన్ ఛాన్సలర్ ఓల్ఫా స్కోల్జ్ ఒక ప్రకటనలో పేర్నొన్నారు.