డ్రగ్స్ కేసు విచారణను తెలంగాణ ప్రభుత్వం అటకెక్కించడం పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అందుకనే దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి హైకోర్టు తీర్పు కాపీ, వినతిపత్రం అందజేస్తూ డ్రగ్స్ కేసును ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ స్పష్టంగా చెబుతోందని ఆరోపించారు.
” డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు.. ఇలా 3 రకాల నేరస్థులు ఉన్నారు. గుజరాత్, ముంబై పోర్టుల్లో 100 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుపడింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నా” అని తెలిపారు.
మీరు సేకరించిన ఆధారాలు, సాక్షాలు వెంటనే ఈడీకి అందజేసి కోర్టు ఆదేశాలు పాటించాలని, డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా సరే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి స్వతంత్ర విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
డ్రగ్స్ వాడకుండా చూడాలని సినీ పరిశ్రమ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తూ 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తాం అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లాంటి పెద్దలు ప్రగల్భాలు పలికారని చెబుతూ సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా..? అని ప్రశ్నించారు.
దూల్‌పేట గుడుంబా స్థావరాలపై దాడులు చేశారని గుర్తు చేస్తూ ప్రత్యామ్నాయం కల్పించక పోవడంతో వాళ్లు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో స్కూల్ నుంచి కాలేజీల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్ లభిస్తోందని రేవంత్ ఆరోపించారు. జూబ్లిహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్‌లు ఉంటే ఇవాళ 90పబ్‌లు ఉన్నాయని గుర్తు చేశారు. బంజారాహిల్స్, జూబ్లిdహిల్స్‌లో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని చెప్పారు.
2017లో డ్రగ్స్ విచారణ ఏమైయింది.. ఎందుకు అటకెక్కింది..? అకున్ సబర్వాల్‌ను అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారు..? అప్పుడు నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్లో ఏమైనాయి..?. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా.. అయినా ముందుకు రాలేదని ధ్వజమెత్తారు.
దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లానని చెబుతూ తెలంగాణ యువత, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలని స్పష్టం చేశారు. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ రాజ్యమేలుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో గుట్కా, మట్కా, గుడుంబా, పేకాట లేదని కేసీఆర్ చెబుతున్నారని అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో విజృంభిస్తోందని, కాలేజీల్లోనే కాదు.. స్కూల్స్‌లోనూ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.