గవర్నర్ల నియామకం అంతా కేంద్రం ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో ఒక రాష్ట్ర గవర్నర్ ప్రధాన మంత్రి పట్ల ధిక్కార ధోరణిలో మాట్లాడటం సాధారణంగా జరగదు. ఆ విధంగా మాట్లాడిన వారు గవర్నర్ పదవిలో కొనసాగడం కూడా అసాదమే అవుతుంది. అయితే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు.
తాజాగా, మోదీ సర్కారును గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని రైతులంతా ఏకమై మార్పు తీసుకురావాలని, బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హరియాణాలోని జింద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉత్తర భారత్ మొత్తం పర్యటిస్తానని, అక్కడి అన్నదాతల్ని ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు.
రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వారి పట్ల గవర్నర్ గా ఉంటూనే సానుభూతి ప్రకటిస్తూ వస్తున్నారు. కొద్దికాలం క్రితం తాను ప్రధానిని కలసి, రైతులు వందల సంఖ్యలో చనిపోతున్నారని, వారిని పిలిచి మాట్లాడమని కోరితే “నేను చావమని చెప్పానా ?” అంటూ అహంకారంతో మాట్లాడారని అంటూ తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇంత వరకు ఒక గవర్నర్ ప్రధానిపై ఇంత దారుణమైన ఆరోపణ చేయడం జరిగి ఉండదు.
బీజేపీలో ప్రధానిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడి ఎవ్వరు మనగడ సాగించడం ప్రస్తుతం కష్టం కాగలదు. పైగా, అధికార పదవులలో ఉన్నవారికి అసలు సాధ్యం కాదు. స్సత్యపల్ మాలిక్ ఇంత ఘాటుగా ప్రధానిపై మాటల దాడులు జరుపుతున్నా కేంద్ర మంత్రులు ఎవ్వరు మాట్లాడటం లేదు. బిజెపి నేతలు ఎవ్వరు ఆయనను ఖండించే ప్రయత్నం చేయడం లేదు. గవర్నర్ పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేయడం లేదు.
ఈ పరిస్థితి అందరికి విస్మయం కలిగిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ లో సాహసోపేత చర్యగా చెప్పుకొంటున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చెల్లుబాటు సత్యపాల్ మాలిక్ చేతుల్లో ఉంది. అందుకనే ఆయన పట్ల ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారు. పైగా ఆయన నిజాయతి పరుడు కావడం, ఆస్తులు కూడబెట్టుకున్నవారు కాక పోవడంతో ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసికొల్పే అవకాశం లేదు.
ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్ర శాసనసభ సిఫార్సు మేరకు కేంద్రం ఈ విధమైన చర్య తీసుకోవచ్చు. ఆ సమయంలో శాసనసభ రద్దయి అనడంతో, దానికి ఉన్న అధికారాలు గవర్నర్ కు ఉంటాయని, గవర్నర్ సిఫార్సుపై ఈ చర్య తీసుకున్నామని కేంద్రం చెబతున్నారు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ముందున్నాయి. ఇప్పటి వరకు తాను ఆ మేరకు సిఫార్సు చేశానని గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఎక్కడా చెప్పలేదు. అందుకు రెండు రోజుల ముందు కూడా అటువంటి ప్రతిపాదన ఏదీ కేంద్రం ముందు లేదని మీడియా ముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఈ విషయమై మౌనంగా ఉంటూ వస్తున్నారు.
సుప్రీం కోర్ట్ లో ఈ కేసులు విచారణకు వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం కీలకం కాగలదు. గవర్నర్ సిఫార్స్ చేయలేదని తేలితే ఆర్టికల్ 370 రద్ద చెల్లక పోవడమే కాకూండా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కూడా చెల్లదు. అందుకనే మాలిక్ ఎన్ని విమర్శలు చేసినా బిజెపి కేంద్ర నాయకత్వం నుండి స్పందన లేదు.
చివరకు తాను గవర్నర్ గా ఉన్న సమయంలో ఒక ఆర్ ఎస్ ఎస్ కేంద్ర నేత, మరో బిజెపి నేత వచ్చి రెండు ఫైల్స్ పై సంతకాలు చేస్తే తనకు రూ 200 కోట్లు వస్తాయని చెప్పారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై సహితం కేంద్రం మౌనం ఉంది. యుపిలో చరణ్ సింగ్ శిష్యుడిగా 1974లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత రెండు సార్లు రాజ్యసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.
బీకేడీ. జనతా పార్టీ, జనతా దళ్, సమాజవాద్ పార్టీ లలో ఉన్న ఆయన బీజేపీలో చేరి 2012లో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అయ్యారు. అయితే మోదీ హయాంలో ఆయనకు చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించలేదు. చివరకు అక్టోబర్,2017లో బీహార్ వంటి పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపినా,ఒక ఏడాది కూడా కాకుండా జమ్మూ, కాశ్మీర్ కు పంపారు.
అక్కడ కూడా 15 నెలలకు మించి ఉండలేక పోయారు. ఆ తర్వాత గోవా వంటి చిన్న రాష్ట్రంకు, అక్కడ కూడా ఏడాది కాకమునుపే మేఘాలయకు పంపారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా, ఈ విధంగా బీహార్ వంటి పెద్ద రాష్ట్రం నుండి చిన్న చిన్న రాష్ట్రాలకు గవర్నర్ లుగా పంపుతూ ఉండడంతో ఆయన బిజెపి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.