కేవలం మూడు రోజుల యుద్ధంతో ఉక్రెయిన్ ప్రభుత్వం లొంగి వస్తుందని, ఆ దేశం తమ చెప్పుచేతలలో ఉంటుందనే అంచనాలతో యుద్ధం ప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ఆ దేశం రాజీధోరణి ప్రదర్శించక పోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ లో అసహనం వ్యక్తమవుతున్నది.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు విధిస్తున్న కఠినమైన ఆర్ధిక ఆంక్షలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చరిత్రలో ఎరుగని సంక్షోభకర పరిస్థితులను ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల్లో యుద్ధం ముగిసి, ఉక్రెయిన్ తమ స్వాధీనం అయినా నిలదొక్కుకోవడం కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ యుద్ధం కారణంగా రష్యా ప్రజలలో తన ఇమేజ్ పెంచుకోవాలనుకున్న పుతిన్ ప్రజాదరణ సహితం బాగా దెబ్బతింటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవంక, భీకరంగా బాంబుల వర్షం కురిపిస్తున్న వెనుకడుగు వేయకుండా సాధారణ పౌరులు సహితం ఆయుధాలు చేబట్టి తమ సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఇస్తుండడం రష్యాను విస్మయానికి గురిచేస్తున్నది.
ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నా స్థానిక ప్రజల తిరుగుబాటు ఆగిపోదని, నిత్యం పక్కలో బల్లెం వలే వేధిస్తూ ఉండే అవకాశం ఉన్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. రష్యా వైమానిక క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి ఉక్రెయిన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ విధ్వంస సృష్టిస్తోంది.
రష్యా సృష్టించి విధ్వంసకర పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులను పొట్టన పెట్టుకుంది. మహిళలు, పిల్లలు, ఆస్పత్రులపై దాడులు జరిపి రాక్షస విధ్వంసానికి బీజం వేసింది. దీంతో రష్యా దేశంలోని ప్రజలే ఆ దేశ అధ్యక్షుడి వ్యవహార తీరుపై ఆగ్రహం చెందడమే కాక నిరసనలు జరుపుతున్నారు. అయినప్పటికీ పుతిన్ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్‌ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు.
పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం రష్యన్ సాధారణ ప్రజానీకాన్ని ఆగమాగం చేస్తోంది. ఆంక్షల్ని ఎదుర్కొంటూనే ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకెళ్లాలని భావించిన పుతిన్‌కు ప్రతి ప్రయత్నం తిప్పికొడుతున్నది. ‘సెల్ఫ్ రష్యా’ ప్రణాళిక బెడిసి కొట్టడంతో పాటు ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థను నానాటికీ దిగజారుస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి, వ్యాపారాలు పడిపోయి ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతున్నది.
విదేశీ కంపెనీలు తమ తమ కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి పోయి లక్షల మంది రోడ్డున పడ్డారు. రష్యాలో మూతపడ్డ కంపెనీలు తెరిపించి ఉపాధి కల్పించాలనుకున్న పుతిన్ ప్రభుత్వ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఎదురవుతోంది. ముఖ్యంగా ధనికులు తమకు అనుకూల నిర్ణయాలు పుతిన్ నుంచి రాకపోవడంతో సహకారం అందించడం లేదు.
నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు కొండెక్కాయి. పాల ధరలు రెట్టింపు కాగా, నిత్యావసరాల ధరలు 50-100 శాతం వరకు పెరిగాయి. వాటిని కొనే స్థోమత సామాన్యులకు లేదు. ఔషధాలకూ కొరత ఏర్పడింది. కొన్ని అయితే దొరకట్లేదు కూడా. నిల్వలు లేకపోవడంతో కొన్నింటిపై పరిమితులు విధిస్తున్నారు.
ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణలపై రష్యా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. విత్‌డ్రా క్యూలు పెరిగిపోతున్నాయి. దళారులు కమీషన్ బేస్డ్తో కరెన్సీ అందిస్తూ.. అందినంతా జనాల నుంచి లాగేస్తున్నారు. ఆంక్షలతో రష్యన్ వ్యాపారాలు మనుగడ ఇబ్బందికరంగా మారింది.
కరోనా సమయం కన్నా ఈ యుద్ధ సమయంలోనే రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కస్టమర్లు తగ్గిపోతుండడంతో ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఆంక్షలతో రష్యాలోని వ్యాపార సంస్థలకు ఆదాయం పడిపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను నిలిపివేశాయి.
అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల సేవలు కూడా రష్యాలో కొన్ని నిలిచిపోగా, మిగిలినవీ పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రష్యన్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. గ్లోబల్ సోషల్ మీడియాపై ప్రభావం పడడంతో రష్యా ఇప్పుడు సొంత మీడియా సంస్థల మీదే ఆధారపడి ఉంది.