తెలంగాణ ఆర్థిక స్థితి గతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరళ్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్రప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్ పేర్కొంది.
ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని..ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని తెలిపింది. అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. తీసుకుంటున్న అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉన్నా బడ్జెటేతర అప్పులు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది.
2019-20లో ప్రభుత్వం తీసుకున్న రుణంలో.. 75 శాతం 2018-19లో తీసుకున్న అప్పులు చెల్లించేందుకే సరిపోయిందని కాగ్ రిపోర్టు తెలిపింది, 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని తేల్చిచెప్పింది,. బడ్జెట్ పర్యవేక్షణలో సర్కారుకు నియంత్రణ లేదని స్పష్టంచేసింది.
కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని, కొన్ని శాఖల్లో మిగులు బడ్జెట్ ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదంది. వివిధ శాఖల్లో పదేపదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను హెచ్చరించలేదని రిపోర్టులో తెలిపింది.
బడ్జెట్ ను పుర్తిస్థాయిలో ఖర్చుచేసే శాఖలకు కేటాయింపులు పెంచలేదని, గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం ఖర్చవుతోందని కాగ్ తెలిపింది. గత ఐదేళ్లలో రూ 84,650 కోట్ల అధిక వ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్దీకరించలేదని తెలిపింది. 2019-20 బడ్జెట్ కేటాయింపు లేకుండానే రూ 2,084 కోట్లు ఖర్చుచేశారని గుర్తుచేసింది. ఇది రాష్ట్ర శాసనసభ సాధికారతను తగ్గించడమేనంది.
ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని రిపోర్టులో తెలిపింది. వార్షిక పద్దుల సమర్పణలో ప్రభుత్వం జవాబుదారీతనం లేదని దుయ్యబట్టింది. కాగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పేర్కొన్నది. బడ్జెట్ అవసరాలకు మించి ప్రభుత్వం రుణాలు తీసుకుందని కాగ్ రిపోర్టు తెలిపింది.
ప్రతిఏటా రుణాల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతం అప్పుల చెల్లింపులకు వినియోగించటంతో, ఇది ఆస్తుల కల్పన మీద ప్రభావం పడిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువగా ఉందని తెలిపింది.
సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ఆలస్యం కావడంతో వ్యయం పెరిగిందని రిపోర్టిచ్చింది. ఉదయ్ పథకం కింద ప్రభుత్వం వాటా రూ 4,063 కోట్లు చెల్లించక పోవటంతో డిస్కం లు నష్టపోయాయని కాగ్ తెలిపింది.