అప్రజాస్వామికంగా తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేలను సభను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ నెల 17న ఇందిరా పార్క్ దగ్గర రాజ్యంగ పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడుతామని, ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చట్ట సభ్యులు, జిల్లా నేతలు, పార్టీ ప్రతిధులంతా పాల్గొంటారని ఈటల తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజునే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందర్ రావు, ఈటల రాజేందర్- ముగ్గురినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. వారు సభలో నిరసన తెలుపగా,ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. దీంతో వారు తమను సభలోకి అనుమతించేలా స్పీకర్ కు సూచించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పీకర్ ను కలిసి తమ వాదనలను వినిపించాల్సిందిగా సోమవారం తీర్పు చెప్పింది. దీంతో ఆ తీర్పు కాపీతో మంగళవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు.
మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని ముగ్గురు అక్కడ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి తాము రాజకీయాలు ఆపాదించాలని అనుకోవడం లేదని, అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని తమను సభలోకి రానీయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
మరోవంక, ఈ విషయమై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిస్తున్నట్లు ఈటెల వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఉత్తర కొరియా నియంత కిమ్ లా వ్యవహరిస్తున్నారని. అధికార బలాన్ని చూసుకుని సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ శాసన వ్యవస్థలో ఇవాళ బ్లాక్ డే అని మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పు కాపీని చూసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన నిర్ణయంలో మార్పు లేదని, తమను సభలోకి అనుమతించడం లేదని స్పష్టం చేశారని, తమ అభ్యర్థనను ఒక్క నిమిషంలోనే తిరస్కరించారని, ఇదే తన నిర్ణయమని చెప్పి స్పీకర్ తన కార్యాలయం నుంచి సభలోకి వెళ్లిపోయారని చెప్పారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని చెబుతూ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజున తాము కేవలం నల్ల జెండాలతో సభకు హాజరయ్యామని, అవేమీ నిషేధ వస్తువులు కాదని స్పష్టం చేశారు. తాము సభా మర్యాదలను ఎక్కడా ఉల్లంఘించలేదని రఘునందన్ చెప్పారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తమపై సస్పెన్షన్ ఎత్తేయలేదని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్.. ఆ పని చేయకపోవడం బాధాకరమని చెబుతూ ఆయన నిర్ణయాన్ని అప్రజాస్వామికంగా భావిస్తున్నామని, తమ గొంతుకను సభలో వినిపించకుండా చేయడం కోసమే సస్పెండ్ చేసి బయటకు పంపారని రఘునందన్ ఆరోపించారు.