నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత అని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎంలో చలనం కూడా లేదని, దున్నపోతు మీద వాన కురిసినట్టు కెసిఆర్ ఉన్నారని ఆమె ధ్వజమెత్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా – వలిగొండ మండలం గోల్నేపల్లి పరిధిలోని బూర్లగడ్డలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేబడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండేదని పేర్కొన్నారు.
ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేవారా? అంటూ ఆమె నాయకుడికి ముందు చూపు ఉండాలని చెబుతూ ఎంత మంది రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు? ఎన్ని ఉద్యోగాలు అవసరం అవుతాయి? ఎంతమందికి స్వయం ఉపాధికి లోన్లు ఇవ్వాలి? ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ? ఇలా అన్ని విషయాలు తెలియాలని హితవు చెప్పారు.
ఇన్నేళ్లకు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని కేసీఆర్ కేవలం ప్రకటన మాత్రమే చేశారని షర్మిల ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకున్నరా? అని ఆమె ప్రశ్నించారు. రుణమాఫీ ఏమైంది? ,మహిళలకు 0% వడ్డీకి రుణాలు ఏమయ్యాయి? ఉచిత విద్య ఏమైంది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, మూడెకరాల భూమి ఏమయ్యాయి? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
చదువుకున్నా నిరుద్యోగులు హమాలీలుగా, గొర్రెల కాపరులుగా, ఆటోడ్రైవర్లుగా,హోటళ్లలో పనిచేస్తూ ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ చదువుకోని వారు ఎమ్మెల్యేల అవుతున్నారని పేర్కొన్నారు. కూలీ నాలీ చేసుకుని బిడ్డలను కష్టపడి చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి కేవలం అయిదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో 2004లో, 2006లో, 2008లో లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని ఆమె గుర్తు చేశారు. 2008లో జంబో డీఎస్సీ పేరుతో 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు.
ప్రైవేటు రంగంలో 11 లక్షల ఉద్యోగాలను ఇచ్చారని, లక్షల మందికి స్వయం ఉపాధి చూపించారని వివరించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ రెడ్డి తల్లి శోభ…షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.