వైసిపి, టిడిపి నాయకుల సవాళ్లతో కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
స్థానిక గాంధీబమ్మ కూడలిలో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు రావాలంటూ పరస్పర సవాళ్లు విసురుకున్నారు. పార్టీ నాయకుల సవాళ్లతో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. 400 మందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పోలీసులు అరెస్టు చేస్తారని శుక్రవారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముద్దరబోయిన… చర్చ కోసం గాంధీబమ్మ కూడలికి రావడంతో ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ముద్దరబోయిన సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును గృహనిర్బంధం చేశారు.
సాయంత్రం ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు సెంటరుకు వచ్చి మీడియాతో మాట్లాడారు. టిడిపి నేతలు చర్చకు రాకుండా పారిపోయారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గానికి టిడిపి చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని ముద్దరబోయిన తమను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. వైసిపి, టిడిపి నేతల మోహరింపులతో నూజివీడులో వాతావరణంలో వేడెక్కింది.