కాలుష్యం అరికట్టడం గురించి అంతర్జాతీయ వేదికలపై ఘనమైన ప్రకటనలు చేస్తున్న భారత దేశంలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ వరుసగా రెండోసారి అపఖ్యాతి మూటగట్టుకొంది.
భారత్‌లో వాయు కాలుష్యం 2021 లో చాలా అధ్వాన్నస్థితికి చేరుకుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. కాలుష్య కొలమానం పిఎం 2.5 ప్రకారం సగటు వాయు కాలుష్య ప్రమాణం క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రామ్స్ కాగా, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయుకాలుష్య ప్రమాణం కన్నా పది రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది.
భారత్ లోని ఏ నగరం కూడా వాయు నాణ్యతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగినట్టు లేదని పేర్కొంది. 117 దేశాల్లోని 6475 నగరాల్లో ఉన్న వాయు కాలుష్య పరిశీలన కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు ఐక్యూఎయిర్ వెల్లడించింది.
ఉత్తర భారతం చాలా అధ్వాన్న స్థితిలో ఉందని, దేశ రాజధానుల్లో ఢిల్లీ వరుసగా రెండో సంవత్సరం కూడా ప్రపంచం మొత్తం మీద కాలుష్య రాజధానిగా తేలిందని నివేదిక పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం కన్నా 15 శాతం కాలుష్యం పెరిగిందని వివరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ భద్రతా పరిమితులకు మించి 20 రెట్లు ఎక్కువగా కాలుష్య స్థాయిలు ఢిల్లీలో పెరిగాయని పేర్కొంది. వార్షిక సగటులో కొలమానం పిఎం 2.5 ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాముల కాలుష్య రేణువులు పేరుకుపోయాయని వివరించింది. ప్రపంచ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం నాలుగో ర్యాంకులో ఉంది.
అలాగే ప్రపంచం మొత్తం మీద అత్యంత కాలుష్యపూరిత స్థలంగా రాజస్థాన్ లోని భివాడీ తేలింది. తరువాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ (ఢిల్లీ తూర్పు సరిహద్దు) చేరింది. అత్యంత కాలుష్యమయమైన టాప్ 15 నగరాల్లో 10 భారత్ లోనే ఉన్నాయి. ఇవన్నీ చాలావరకు దేశ రాజధాని చుట్టూ ఉన్నవే.
దాదాపు 100 అత్యంత కలుషిత ప్రదేశాల్లో 63 భారత్ నగరాలే కావడం విశేషం. వీటిలో సగానికి సగం హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. చికాగో యూనివర్శిటీ రూపొందించిన జీవ ప్రమాణ సూచిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వాయు నాణ్యత మెరుగుపడినట్టయితే ఢిల్లీ, లక్నో నగరాల్లోని ప్రజల ఆయుప్రమాణం మరో పదేళ్లు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
వాహన కాలుష్యం, బొగ్గు, పరిశ్రమల వ్యర్ధాలు
వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, బొగ్గు మండించే విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, వంట చెరకుగా పంటవ్యర్ధాల దహనం, నిర్మాణ రంగం వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలుగా ఉంటున్నాయి. గత ఏడాది వాయు కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ పరిసరాల్లో ఉండే భారీ విద్యుత్ ప్లాంట్లను గత నవంబరులో మొట్టమొదటిసారి మూసివేశారు.
వాయు కాలుష్యం కారణంగా ఏటా భారత్‌కు 150 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సంక్షోభం ఎదురౌతోంది. అనారోగ్య ప్రభావం పరిశీలిస్తే వాయు కాలుష్యంతోపాటు గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర వ్యాధులు సంక్రమించి నిమిషానికి ముగ్గురు వంతున ప్రాణాలు కోల్పోతున్నారు. చెన్నై తప్ప మిగతా ఆరు మెట్రో నగరాల్లో గత ఏడాది వాయుకాలుష్యస్థాయిలు విపరీతంగా పెరిగాయి.
2021సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ డేటా ప్రకారం ఢిల్లీ, కొల్కతా, ముంబై నగరాల్లో వాయునాణ్యత చాలా అధ్వాన్నంగా తయారైంది. పార్లమెంట్లో ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం చాలా ధీనస్థితి (పూర్ టు సివియర్) నుంచి తీవ్ర స్థాయి రోజుల సంఖ్యను సూచించింది.
ఢిల్లీలో ఒక్క ఏడాది లోనే 139 రోజుల నుంచి 168 రోజులకు కాలుష్య స్థాయిలు అమాంతంగా 21 శాతం వంతున పెరిగాయి. అలాంటి రోజులు కొల్కతాలో అంతకు ముందు ఏడాది 74 నుంచి 83, ముంబైలో 20 నుంచి 39 రోజులు వరకు వాయుకాలుష్య రోజులు పెరిగాయని నివేదిక వెల్లడించింది.