దేశంలో కరోనా ఆంక్షలను ఈ నెల 31 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తున్న నేపధ్యంలో ఆంక్షలను ఎత్తివేస్తున్నా, మాస్కులు, భౌతిక దూరం పాటించడం గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అన్ని రాష్ట్రాల కార్యదర్శలకు హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఈ మేరకు సమాచారం అందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సామర్ధ్యాన్ని, వ్యవస్థలను అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో రెండేళ్ల నుంచి కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
‘‘కరోనా కట్టడి చేసేందుకు గత 24 నెలలుగా రోగనిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకా, ఆసుపత్రుల్లో సౌలతులు.. వంటి వివిధ అంశాల్లో మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కరోనా విషయంలో చాలా అవగాహన వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత సామర్థ్యాలను పెంచుకున్నాయి. ఏడు వారాలుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి” అని అజయ్ భల్లా వివరించారు.
ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.. కరోనా కట్టడి రూల్స్ అమలు చేయాల్సిన అవసరంలేదని, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలను అమల్లో ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేయడం, ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య పూర్తి తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 1,500 దాకా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా అమలులో ఉండదని కేంద్రం వెల్లడించింది.
విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద 2020 మార్చి 24న కేంద్రం తొలిసారి కరోనా గైడ్లైన్స్ జారీ చేసింది. వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వాటిలో మార్పులు చేశారు.