పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ లో జరిగిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనంకు గురికావడం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఆ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులకు దర్పణం పడుతుందని అంటూ పలువురు పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బనెర్జీ సంఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్థులను, అలాంటి నేర శక్తులను ప్రోత్సహిస్తున్న వారిని ఎప్పటికీ క్షమించరాదని బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. నేరస్థులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుని శిక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
స్వాతంత్య్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్న అమరులకు నివాళిగా బుధవారం కలకత్తాలో ఏర్పాటు చేసిన ”బిప్లోబి భారత్ గ్యాలరీ”ని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబభిస్తూ ఇలాంటి హేయమైన నేరానికి పాల్పడిన వారిని మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం చట్టానికి పట్టి ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ జరిగాయి
బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అయితే తాను ఈ సంఘనలను ఏమాత్రం సమర్ధించడం లేదని, పూర్తి పారదర్శకతతోనే విచారణ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
“బీర్భూమ్, రాంపూర్హట్లో జరిగిన సంఘటనలు అత్యంత దురదృష్టకరం. వెంటనే ఓసీ, ఎస్డీపీఓ అధికారులను డిస్మిస్ చేస్తున్నారు. రేపు రాంపూర్హట్కు నేను వెళ్తున్నాను.” అంటూ మమత ప్రకటించారు. సంఘటన స్థలాన్ని బీజేపీ నేతలు సందర్శించడంపై దీదీ స్పందిస్తూ ఇది బెంగాల్. యూపీ కాదని ఎద్దేవా చేశారు.
హాథ్రస్ ఘటన నేపథ్యంలో తృణమూల్ నేతలు అక్కడికి వెళ్లగా, పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదని ఆమె గుర్తు చేశారు. కానీ తామలా చేయడం లేదని, తాము ఎవర్నీ ఆపడం లేదని ఆమె చురకలంటించారు. బీర్భూమ్ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు డీజీపీ మనోజ్ మాలవీయ తెలిపారు.
హైకోర్టు స్వీయ దర్యాప్తు
బీర్భూమ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. దుండగులు దాదాపు 12 ఇళ్లను తగులబెట్టి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటిలో నివసిస్తున్న వారిని నిర్బంధించి ఆ ఇంటిని తగుల బెట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ఈ హింసాకాండపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సాక్షులకు రక్షణ కల్పించాలని, పోలీస్ కేసు – దర్యాప్తు వివరాలు గురువారం మధ్యాన్నం లోపు కోర్ట్ కు సమర్పించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఫోరెన్సిక్ నివేదికను కోరారు.