ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు యోగి ఆదిత్యనాథ్ ను ఉత్తర ప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా గురువారం లాంఛనంగా ఎన్నుకున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రాధామోహన్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, కేపీ మౌర్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ బెర్తుల కేటాయింపు, డిప్యూటీ సీఎంల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
యూపీలో ఉప ముఖ్యమంత్రులుగా ఈసారి కూడా ఇద్దరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉంటే తాజా ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మాజీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి అదే పదవిలో అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బిజెపి- ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు.
వేదికపై మోదీ, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యోగీ ఫొటోలతో కూడిన భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు పాలుపంచుకుంటారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, బోనీ కపూర్లకు కూడా ఆహ్వానం వెళ్లింది. తాజాగా భారీ హిట్ సాధించిన కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్శణగా నిలవనుంది.
నటుడు అనుపమ్ ఖేర్‌తో పాటు వివేక్ అగ్నిహోత్రీకి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
యూపీలో దాదాపు 37 ఏళ్ల తరువాత ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగీ ఆదిత్యనాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లి ఎన్నికల్లో 255 సీట్లు బీజేపీ సాధించింది. 41.29 శాతం ఓట్లు వచ్చాయి.
ఈ కార్యక్రమానికి దేశంలోని 50 వ్యాపార సంస్థల యజమానులు కూడా హాజరవుతున్నారు. వీరిలో టాటా గ్రూప్, అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, మహీంద్రా గ్రూప్, ఐటీసీ గ్రూప్, పెప్సికో, హిందుస్తాన్ యూనిలీవర్ గ్రూప్, ఫ్లిప్‌కార్ట్, ఐజీఎల్ గ్రూప్ ఉన్నాయి.