దేశ వ్యక్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్ (బెంగాల్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను కూడా సీబీఐకి అప్పగించాలని సూచించింది.
వారం రోజుల్లో దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును న్యాయస్థానానికి అందజేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. బీర్భూమ్ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో మార్చి 22న జరిగిన అల్లర్లలో మూడు ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.
అధికార తృణమూల్ పార్టీకి చెందిన ఓ నేత మృతి తర్వాత ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మందిని సజీవ దహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది.
మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ నిఫుణులు పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సజీవ దహనానికి ముందు బాధితులపై దాడులు జరిగాయని, ఆ తర్వాతే వారిని ఇంట్లో బంధించి తగులబెట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాంపూర్హట్ ఆస్పత్రి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆదేశంతో గంటల వ్యవధిలోనే స్థానిక టీఎంసీ నాయకుడు అనరుల్ షేక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉద్యోగులపై వేటు వేశారు.
బీర్భూమ్ ఘటన జరిగిన నాటి నుంచి టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్‌గా ఉన్న అనరుల్ షేక్ పేరు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నది. ఈ ఘటనలో అతని ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
సీఎం మమత ఎదుట కూడా బాధితులు అనరుల్ షేక్ పేరును ప్రస్తావించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. రాంపూర్హట్కు చెందిన అనరుల్ షేక్.. టీఎంసీ ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు.
బీర్భూమ్ ఎమ్మెల్యే, బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి ఇతను కీలక అనుచరుడు. టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ కావడంతో బొగ్టుయ్ గ్రామంలో రాజకీయ పరిణామాలు ఇతని సారధ్యంలో జరుగుతూ ఉంటాయి.