రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ అంశాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ చెంతకు తీసుకువెళ్లాలన్న యోచనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉన్నట్టు తెలుస్తోంది.
ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ప్రధానిని కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరాలని కేసీఆర్ రాష్ట్రానికి చెందిన ఎంపీలను కోరినట్టు సమాచారం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ముడి బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తెగేసి చెప్పడంతో ఇక ఈ అంశాన్ని ప్రధాని వద్దే తేల్చుకోవాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి.
పంజాబ్ నుంచి ఏటా గోధుమలు, ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ముడి బియ్యమే కావాలని పట్టుబట్టడం బట్టి చూస్తుంటే రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఏదో మెలిక పెట్టి తద్వారా ధాన్యాన్ని సేకరించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని తెరాస అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చర్చనీయాంశం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ ప్రజలకు నూకల అన్నం తినే అలవాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో పడుతున్న తెరాస ఈ అంశాన్ని ఊరు వాడల్లో ప్రచారం నిర్వహించి బిజెపిని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
రైతులు పండించిన ధాన్యాన్ని భేషరతుగా సేకరించాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు సమావేశమైన ఏకగ్రీవ తీర్మానం చేసి పంపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ధాన్యం చేతికొచ్చే వేళ వరి కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని కేంద్రం మెడలు వంచైనా పంటను కొనుగోలు చేయిస్తామన్న భరోసాను రైతుల్లో నింపాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ, రైతు వేదికల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ సమావేశాలను నిర్వహించాలని కోరింది. ధాన్యం పోరును మరింత ఉధృతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లిd నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు అయినా… కాకపోయినా ఢిల్లికి వెళ్లి అక్కడే మకాం వేయాలని ఈలోపు, జాతీయ స్థాయిలోని రైతు సంఘాల నేతలతో సమావేశమై ధాన్యం సేకరణ విషయంలో వారి మద్దతును కూడగట్టాలని కేసీఆర్ సంకల్పించారు.
కలిసివచ్చే అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ధాన్యం సేకరణకు కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచాలన్న నిర్ణయానికి తెరాస వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో రైతు సంఘాల నేతలతో సమావేశాలు, చర్చాగోష్టులను నిర్వహించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.